భారతదేశంలో 18 ఏళ్లు నిండిన వయోజనులకు ఎలక్షన్ కమిషన్ ఓటు హక్కు అవకాశాన్ని కల్పిస్తుంది. ఓటర్ కార్డ్ ఉన్న వారు ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకుంటారు. ఒకవేళ ఎవరికైనా రెండు ఓటరు గుర్తింపు కార్డులు కలిగి ఉంటే లేదా రెండో ఓటర్ కార్డు కోసం ప్రయత్నిస్తే.. అలా చేయడం చట్టపరమైన నేరం అవుతుంది. అయితే ఒకటి కంటే ఎక్కువ ఓటరు కార్డులు కలిగి ఉండటం చట్టవిరుద్ధం అనీ, ఇది ప్రజా ప్రాతినిధ్య చట్టం 1950లోని సెక్షన్ 31 కింద నేరం అనీ.. ఈసీఐ స్పష్టం చేసింది.
ఈ పరిస్థితుల్లో ఒక ఓటరు ఒకే ఒక ఎపిక్ కార్డు మాత్రమే కలిగి ఉండాలనీ, అదనపు కార్డులు ఉంటే.. వెంటనే సరెండర్ చేయాలని ఈసీఐ హెచ్చరించింది. ఈ నిబంధనలను ఉల్లంఘిస్తే గరిష్టంగా ఏడాది జైలు శిక్ష, జరిమానా లేదా రెండూ విధించే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఇటీవల బహుళ ఎపిక్ కార్డులపై ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ముఖ్యంగా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ.. ఓట్ చోరీ యాత్రనే చేస్తూ.. ఈసీఐపై ఒక రకమైన యుద్ధం చేస్తున్నారు.

దాంతో ఈసీఐ అప్రమత్తమైంది. ఒక వ్యక్తి రెండు లేదా అంతకంటే ఎక్కువ ఎపిక్ కార్డులు కలిగి ఉంటే, ఒక కార్డును మాత్రమే ఉంచుకుని, మిగతావి సరెండర్ చేయాలని ఈసీఐ సీనియర్ అధికారి ఒకరు మీడియాతో అన్నారు. సరెండర్ ప్రక్రియ కోసం, ఓటర్లు… ఫారం-7 ద్వారా దరఖాస్తు చేసుకోవాలనీ, ఈ ప్రక్రియ ఆన్‌లైన్‌లో కూడా అందుబాటులో ఉందని ఆయన వెల్లడించారు. ఇలా చెయ్యడం ద్వారా.. అదనపు ఓటర్ పేర్లను అధికారులు తొలగిస్తారు. బీహార్‌లో జరుగుతున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్) సందర్భంగా, రాజకీయ నాయకులు… అనేక నియోజకవర్గాల్లో ఓటర్లుగా నమోదైనట్లు ఆరోపణలు వచ్చాయి.
ఉదాహరణకు, కాంగ్రెస్ నాయకుడు పవన్ ఖేరాకి రెండు ఎపిక్ కార్డులు ఉన్నాయని బీజేపీ కంప్లైంట్ చేసింది. దీనిపై స్పందించిన ఈసీఐ, ఖేరాకు నోటీసులు జారీ చేసింది. అలాగే, న్యూఢిల్లీ నియోజకవర్గంలో బహుళ ఎపిక్ కార్డుల ఆరోపణలపై ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ (ఈఆర్‌ఓ) కొంతమందికి నోటీసులు పంపారు. పవన్ ఖేరా ఈసీఐ తీరును విమర్శించారు. తాను 2016లో న్యూఢిల్లీ నియోజకవర్గం నుంచి తన పేరును తొలగించాలని ఫారం-7 సమర్పించినప్పటికీ, ఈసీఐ నిర్లక్ష్యంగా వ్యవహరించి ఓటరు జాబితా నుంచి తన పేరును తొలగించలేదని ఆయన ఆరోపించారు.

గత నాలుగు ఎన్నికల సమయంలో ఓటరు జాబితా సవరణలు జరిగినప్పటికీ, తన పేరు ఇప్పటికీ జాబితాలో ఉందనీ, ఈసీఐ సమర్థంగా పనిచెయ్యట్లేదని ఆయన ప్రశ్నలు లేవనెత్తారు. ఓటరు జాబితా సమగ్రతను కాపాడేందుకు కృషి చేస్తున్నట్లు ఈసీఐ తెలిపింది. డిజిటల్ సేవల ద్వారా ఓటర్లకు సౌలభ్యం కల్పిస్తున్నట్లు వివరించింది. ఈ-ఎపిక్ (డిజిటల్ ఓటరు ఐడీ) డౌన్‌లోడ్, ఓటరు జాబితాలో పేరు తొలగింపు వంటి సేవలు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉన్నాయి.
ఓటర్లు వీటిని ఉపయోగించుకోవాలనీ, చట్టాన్ని గౌరవించాలని కేంద్ర ఎన్నికల సంఘం కోరింది. అందువల్ల ఎవరికైనా 1 కంటే ఎక్కువ ఓటర్ కార్డులు ఉంటే.. వాటిని త్వరగా తొలగించుకోవడం మేలు. ఒకటి మాత్రమే కలిగి ఉండటం శ్రేయస్కరం.