27 ఏళ్ల క్రితం తప్పిపోయిన తన భర్తను ఓ మహిళ గుర్తించింది. 1998లో జార్ఖండ్ కు చెందిన భార్య, ధన్వా దేవి, ఇద్దరు కుమారులు, కమలేష్ , విమలేష్‌లను ఒంటరిగా వదిలేసి వెళ్లిపోయాడు గంగాసాగర్ యాదవ్. అప్పటినుంచి అతని కుటుంబం అతని కోసం వెతకని చోటు లేదు. తాజాగా కుంభమేళాకు వచ్చిన వారికి గంగాసాగర్ యాదవ్ అఘోరిగా కనిపించాడు. పూర్తీ వివరాలోకి వెళ్తే 27 ఏళ్ల క్రితం అదృశ్యం..ఝార్ఖండ్‌కు చెందిన గంగాసాగర్ యాదవ్ అనే వ్యక్తికి భార్య ధన్వాదేవి, కుమారులు కమలేశ్, విమలేశ్ ఉన్నారు. 1998లో గంగాసాగర్ ఉన్నట్టుండి అదృశ్యమయ్యాడు.
భర్త కనిపించకపోయే సరికి కంగారుపడిన ధన్వా దేవి పలు ప్రాంతాల్లో గంగాసాగర్ ఆచూకీ కోసం వెతికింది. అయినా అతడు కనిపించలేదు. కొన్ని నెలల అన్వేషణ తర్వాత గంగా సాగర్‌పై ఆశలు వదులుకున్న భార్య, తన పిల్లలను కష్టపడి పెంచి పెద్ద చేసింది. గంగాసాగర్ సోదరుడు మురళి తెలిపిన వివరాలు ప్రకారం, తాజాగా మహా కుంభమేళాకు హాజరైన ధన్వాదేవి బంధువులు అక్కడ ఓ అఘోరిని చూసి షాక్ అయ్యారు. ఆ అఘోరి అచ్చం గంగాసాగర్లా ఉండడం వల్ల ఫొటో తీసి, ధన్వాదేవికి పంపించారు. ఫొటో చూడగానే భర్తను గుర్తించిన ధన్వాదేవి తన పిల్లలు, కుటుంబ సభ్యులతో అక్కడికి చేరుకుంది.
నుదిటిపై మచ్చ, ఎత్తు పళ్లు, మోకాలిపై దెబ్బలు చూసి తన భర్తను గుర్తించిన ధన్వాదేవి తమతో పాటు ఇంటికి రావాలని గంగాసాగర్‌ను కోరింది. వారిని చూసిన అఘోరి విచిత్రంగా ప్రవర్తించాడు. తాను వారణాసికి చెందిన అఘోరినని చెప్పాడు. తన పేరు బాబా రాజ్ కుమార్ అని పేర్కొన్నాడు. ధన్వాదేవి కుటుంబంతో తనకేం సంబంధం లేదని వాదించాడు. అన్నను గుర్తుపట్టిన తమ్ముడు..గంగాసాగర్ యాదవ్ తమ్ముడు మురళి యాదవ్ సైతం తన అన్నను గుర్తించాడు. అయినా అఘోరి మాత్రం అందుకు అంగీకరించలేదు. చివరకు సదరు కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు.
కుంభమేళా ముగిసే వరకూ ఇక్కడే ఉంటామని, తమ భర్తకు అవసరమైతే డీఎన్‌ఏ పరీక్షలు చేయిస్తామని ధన్వాదేవి తెలిపారు. డీఎన్ఏ పరీక్షలో అఘోరి గంగాసాగర్ కాదని తేలితే ఆయనకు క్షమాపణలు చెబుతామని మురళి యాదవ్ పేర్కొన్నారు. ధన్వాదేవి కుటుంబ సభ్యుల్లో కొందరు కుంభమేళా నుంచి ఇంటికి వచ్చారు. మరికొందరు కుంభమేళాలోనే ఉండి గంగాసాగర్‌ను నిశితంగా పరిశీలిస్తున్నారు. ఇదిలా ఉంటే, గంగాసాగర్ ఇంటి నుంచి వెళ్లిపోయేసరికి అతడి పెద్ద కొడుకు వయసు కేవలం రెండేళ్లు. చిన్న కుమారుడు ఇంకా తల్లి గర్భంలో ఉన్నాడు.