చిన్న వయసులోనే సినిమాల్లో అడుగుపెట్టి తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో అగ్రహీరోల సరసన నటించి స్టార్ హీరోయిన్‌గా ఎదిగిన ఆమె, ఇప్పటికీ అభిమానులను అలరిస్తూనే ఉంది. అయితే దక్షిణాదిలో అత్యధిక డిమాండ్ ఉన్న కథానాయికగా చక్రం తిప్పిన మీనా ఇప్పటికీ సినిమాల్లో నటిస్తోంది. ఓ వైపు సీనియర్ హీరోలకు హీరోయిన్ గా నటిస్తోన్న ఆమె మరోవైపు సహాయక నటిగానూ మెప్పిస్తోంది.
కాగా దక్షిణాదిలో స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన మీనా హిందీలో ఒకే సినిమాలో నటించింది. పర్దా హై పర్దా అనే ఒకే ఒక మూవీ లో చేసిన ఈ అందాల తార ఆ తర్వాత అవకాశాలు వచ్చినా నో చెప్పింది. ముఖ్యంగా ఓ స్టార్ హీరో అయితే పలుమార్లు తనతో సినిమా చేయమని కోరినా.. చేయలేకపోయిందట. ఒకానొక దశలో ఆయన ఉన్న హోటల్‌కి వెళ్లాలంటే భయపడ్డానని అంటోది.
తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన ఈ ముద్దుగుమ్మ తాను హిందీ సినిమాలు ఎందుకు చేయలేదో వివరించింది. ‘నేను తెలుగుతో పాటు తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో వరుస సినిమాలు చేశాను. అదే సమయంలో హిందీ ఆఫర్స్ కూడా వచ్చాయి. కానీ చేయలేకపోయాను. ఇక్కడే నాకు తినడానికి, నిద్రపోవడానికి కూడా సమయం దొరకలేదు. ఇక బాలీవుడ్ సినిమాలు ఎలా చేస్తా. పైగా అక్కడ టైమ్‌కి షూటింగ్ లు పూర్తి కావని తెలిసింది. హిందీలో ఒక్క సినిమా చేసేలోపు సౌత్‌లో నాలుగు సినిమాలు చేయొచ్చని చెప్పారు.
అందుకే నేను బాలీవుడ్‌పై పెద్దగా ఫోకస్ చేయలేదు . అప్పట్లో బాలీవుడ్ హీరో మిథున్ చక్రవర్తికి ఊటీలో ఒక హోటల్ ఉండేది. సినిమా షూటింగ్స్ అన్నీ అక్కడే జరిగేవి. నా సినిమా షూటింగ్ కోసం అక్కడి వెళ్తే.. అదే హోటల్‌లో ఉండేదాన్ని. అప్పుడు మిథున్ చక్రవర్తి నా దగ్గరకు వచ్చి మరీ..‘నాతో సినిమా ఎప్పుడు చేస్తావ్’ అని అడిగేవాడు. నాకు చేయాలనే ఉండేది..కానీ డేట్స్ ఖాళీగా ఉండేవి కాదు. నేను వెళ్లిన ప్రతిసారి ఆయన నా గది దగ్గరకు వచ్చి మరీ అడిగేవాడు.
దీంతో నాకు ఏం చెప్పాలో అర్థమయ్యేది కాదు. ఒకానొక దశలో ఆ హీరో హోటల్‌కి వెళ్లాలంటేనే భయపడేదాన్ని. అంత పెద్ద స్టార్ హీరోకి నో చెప్పలేక మనసులోనే బాధపడేదాన్ని. ఎప్పుడైనా ఊటీకి వెళితే.. ఆ హోటల్ వద్దు..వేరే హోటల్‌లో రూమ్ బుక్ చేయమని నిర్మాతలను అడిగేదాన్ని. ఆయనకు నొ చెప్పాలంటే ఏదోలా అనిపించేంది’ అని అప్పటి సంగతులను గుర్తు తెచ్చుకుంది మీనా.
