నాసిక్‌లో ఓ తండ్రి తన కుమారుడికి పెళ్లి చేసేందుకు సంబధాలు వెతికాడు. ఈ క్రమంలో ఓ అమ్మాయితో పెళ్లి సంబంధం కుదిర్చాడు. రెండు కుటుంబాలు పెళ్లి డేట్ ఫిక్స్ చేసుకుని.. ఏర్పాట్లు చేసుకుంటున్నాయి. మరోవైపు వరుడు పెళ్లి కలల్లో తేలిపోతున్నాడు. అయితే సరిగ్గా పెళ్లి సమయానికే వధువు వేరే వ్యక్తితో వెళ్లిపోయిన సందర్భాలూ చూశాం. కానీ మహారాష్ట్రలో ఓ షాకింగ్ ఘటన చోటు చేసుకుంది.
తనకు కాబోయే కోడలిని వరుడి తండ్రి వివాహం చేసుకోగా.. అది చూసి షాకైన కొడుకు విరక్తితో సన్యాసం మారేందుకు నిర్ణయించాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మహారాష్ట్రలోని నాసిక్‌లో ఓ తండ్రి తన కొడుకు కోసం ఓ అమ్మాయిని చూశాడు. పెళ్లి తేదీ కూడా ఖరారు చేశాడు. వైభవంగా వివాహం చేసేందుకు ఇరు కుటుంబాలు భారీగా ఏర్పాట్లు చేసుకున్నాయి. అయితే, తనకు కాబోయే కోడలితో వరుడి తండ్రి ప్రేమలో పడ్డాడు. ఇద్దరూ కలిసి ప్రేమాయణం సాగించి కుటుంబ సభ్యులు ఎవరికీ చెప్పకుండా గుడిలో పెళ్లి చేసుకుని.. నేరుగా పెళ్లి దుస్తుల్లోనే ఇంటికి వచ్చారు.
ఇది చూసి వరుడితో పాటు అతని కుటుంబసభ్యులు, బంధువులు షాకయ్యారు. భార్య కావాల్సిన యువతి చేసిన మోసానికి, తండ్రి చేసిన ద్రోహానికి ఆ యువకుడు తీవ్ర మనస్తాపం చెందాడు. జీవితంపై విరక్తి పెంచుకుని సన్యాసిగా మారేందుకు నిర్ణయించుకున్నాడు. మరో అమ్మాయిని తెచ్చి వివాహం చేస్తామని తండ్రి హామీ ఇచ్చినా ప్రేమ, పెళ్లిపై నమ్మకం పోయిందని ఆవేదన చెందాడు. తాను సన్యాసిగానే మారుతానని భీష్మించుకుకూర్చున్నాడు. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.