బంగారం ఇప్పుడు ఒక విలువైన ఆస్తిగా మారిపోయింది. ఫిజికల్ బంగారం కాపాడుకోవడం అనేది ఒక సవాలుగా మారింది అని చెప్పవచ్చు. భారతీయులకు బంగారంతో అవినాభావ సంబంధం ఉంది. ధరించేందుకు ఎక్కువగా ఇష్టపడుతుంటారు. అందులో మహిళలు ప్రత్యేకంగా ప్రతిరోజు బంగారు ఆభరణాలు ధరించి ఉంటారు. అయితే ఆమె చోరీకి వచ్చిందంటే చాలు ఎవరైతే నాకేంటి అన్న లెవెల్‌లో చేతివాటం ప్రదర్శిస్తుంది..
చుట్టూ ఎవరైనా ఉన్నారా… నిఘా నేత్రం సిసి టివి కెమెరాలు ఉన్నాయా అన్న సోయి కూడా ఉండదు.. చేయాలన్న పనిని క్షణాల్లో ముగించుకుని ఉడాయించడం ఆమె స్పెషాలిటీ.. తనతో పాటు మరో మహిళను, ఓ చిన్న పిల్లాడిని తీసుకొస్తుంది. నగలు చూస్తున్నట్టు నటిస్తూ దుకాణదారులను ఏమార్చి గుట్టు చప్పుడు కాకుండా పనికానిచ్చేస్తుంది. గతంలో కూడా ఇదే విధంగా చేసి జైలుకు కూడా వెళ్ళి వచ్చింది. అయితే, ఈసారి మాత్రం చోరీ చేస్తూ స్పాట్‌లో అడ్డంగా దొరికి పోయింది.
ప్రకాశం జిల్లా మార్కాపురంలోని బంగారు షాపులలో వరుస దొంగతనాలు చేస్తున్న మహిళను పట్టుకొని పోలీసులకు అప్పగించారు షాపుల యజమానులు.. రెండు నెలల కిందట ఇలాగే ఓ షాపులో 10 జతల పట్టీలు అపహరించినట్టు గుర్తించారు. నేడు మరొక షాపులో మూడు జతల పట్టిలు అపహరించేందుకు ప్రయత్నించడంతో సిసి కెమెరాలలో మహిళను గుర్తించి, పట్టుకొని పోలీసులకు అప్పగించారు గోల్డ్ షాప్ సిబ్బంది. దుకాణ యజమాని గుర్తించి ఆ మహిళా దొంగను పోలీసులకు అప్పగించాడు. ఇప్పటివరకు కేజీకి పైగా వెండిని కిలాడి లేడీ చోరీ చేసినట్లు విచారణలో పోలీసులు గుర్తించారు.
చోరీచేసిన వెండిని బంగారు దుకాణాలలో విక్రయించేందుకు నిందితురాలు ప్రయత్నిస్తున్నట్లు తెలుసుకున్నారు. సిసి కెమెరాలో రికార్డు అయిన దృశ్యాల ఆధారంగా మహిళా దొంగను గుర్తించి పోలీసులకు పట్టించినట్టు దుకాణ యజమానులు తెలిపారు. అదుపులోకి తీసుకున్న మహిళా దొంగను పోలీసులు విచారిస్తున్నారు.
