అనారోగ్యానికి గురైన మన్మోహన్ సింగ్ ను కుటుంబ సభ్యులు ఢిల్లీ ఎయిమ్స్ కు తరలించగా, చికిత్స పొందుతూ ఆయన కన్నుమూశారు. అయితే ఆర్థికవేత్తగా ప్రత్యేక గుర్తింపు పొంది, ప్రధానమంత్రిగా దేశానికి విశిష్ట సేవలు అందించిన మన్మోహన్ జీవితంలో ఎన్నో చెరగని పేజీలు ఉన్నాయి. అయితే మన్మోహన్ రాజకీయ జీవితమే కాకుండా, వ్యక్తిగత జీవితంలో కూడా ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్నారు.
1932 సెప్టెంబరు 26న పంజాబ్ అంటే ప్రస్తుతం పాకిస్తాన్ లో గల చక్వాల్ లో ఒక కోహ్లీ కుటుంబములో జన్మించారు. ఈయన బాల్యంలోనే తల్లిని కోల్పోయారు. చదువంటే ప్రాణం గల మన్మోహన్ నిరంతరం పుస్తకం చేతిలో పట్టుకొని పఠించేవారు. తల్లిని కోల్పోయిన మన్మోహన్ ను అమ్మమ్మ చేరదీసి పోషించారు. నాడు ఆమె చేరదీసి చెప్పిన మాటలే, మన్మోహన్ ను మంచి ఆర్థికవేత్తగా ప్రపంచానికి పరిచయం చేసిందట.
ఇక మన్మోహన్ వైవాహిక జీవితంలోకి వెళ్తే.. మన్మోహన్ వివాహం 1958 లో జరిగింది. ప్రొఫెసర్, రచయిత గురుశరణ్ కౌర్ కోహ్లీని మన్మోహన్ వివాహం చేసుకున్నారు. ఒకరేమో ఆర్థికవేత్త, మరొకరు ప్రొఫెసర్ గా ఎవరి రంగంలో వారు రాణించారు. వీరికి ముగ్గురు కుమార్తెలు సంతానం. ఉపీందర్ , దమన్ , అమృత్ లు కాగా, వీరు కూడా ఉన్నత విద్యను కొనసాగించి రచయితలుగా కూడా పలు పుస్తకాలు రాశారు.
ఉపిందర్ కౌర్ ఢిల్లీ యూనివర్సిటీలో హిస్టరీ ప్రొఫెసర్ గా పనిచేస్తున్నారు. ఆమె ప్రాచీన ఢిల్లీ, ఎ హిస్టరీ ఆఫ్ ఏన్షియంట్ అండ్ ఎర్లీ మిడిల్ ఇండియా సహా ఆరు పుస్తకాలు రాశారు. దమన్ కౌర్ కూడా నవల రచయిత్రిగా పేరు గాంచారు. మూడవ కుమార్తె అమృత్ కూడా, ఏసీఎల్యూలో స్టాఫ్ అటార్నీగా పనిచేస్తున్నారు.