కడపలో విజయ్ భాస్కర్ రవాణా శాఖలో బ్రేక్ ఇన్‌స్పెక్టర్ గా పనిచేస్తున్నారు. కడప శివారులోని భాకరాపేటలో ఉన్న వాహనాలను తనిఖీ చేసేందుకు ఒక హోంగార్డుతో కలిసి అక్కడకి వెళ్లారు. అక్కడ రాజస్థాన్, బీహార్, తమిళనాడు తదితర రాష్ట్రాలకు చెందిన లారీలు పార్క్ చేసి ఉన్నాయి. అక్కడ పార్కింగ్ చేసి ఉన్న ఇతర రాష్ట్రాల లారీల డ్రైవర్ల వద్దకు విజయ్ భాస్కర్ తనిఖీకి వెళ్లారు.
అయితే డ్రైవర్ల ఆగ్రహంతో అక్కడి నుంచి వెళ్లిపోయేందుకు ప్రయత్నించిన బ్రేక్ ఇన్‌స్పెక్టర్‌పై కొందరు వాహనాల డ్రైవర్లు చేయి చేసుకున్నారు. తాము ఐడీ కార్డు ఏదని అడిగితే ఎందుకు వెళ్లిపోతున్నావని డ్రైవర్, సిబ్బందిని అడ్డుకున్నారు. అతను ఆర్టీవో అధికారి కాదని కేకలు వేస్తూ వాహనాన్ని అడ్డుకున్నారు. పోలీసులకు సమాచారం అందించాలని స్థానికుల్ని కోరారు.
ఈ మొత్తం దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దాబా వద్ద తనిఖీలకు వచ్చిన బ్రేక్ ఇన్‌స్పెక్టర్ కడప ఆర్టీవో ఆఫీస్‌లో విధులు నిర్వర్తిస్తున్నట్టు గుర్తించారు. అక్రమ వసూళ్లకు పాల్పడుతూ ఉండడంతో డ్రైవర్లు తిరగబడ్డారు. నిత్యం ఏదో ఒక సాకుతో తమ వాహనాలకు అన్ని అనుమతులు ఉన్నప్పటికీ తమను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని డబ్బులు ముట్ట చెప్పితే గాని వాహనాలను వదిలిపెట్టడం లేదని డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేశారు.
రవాణా శాఖ అధికారులు యూనిఫామ్ లేకుండా రోడ్డు పై కనబడితే కఠిన చర్యలు తప్పవని మంత్రి హెచ్చరించారు. ప్రభుత్వ అధికారిగా ఉంటూ అక్రమ వసూళ్లు పాల్పడటం హేయమని, అధికారిని ప్రశ్నించడం పట్ల డ్రైవర్ల ఆవేదన అర్ధమవుతుందని పేర్కొన్నారు.