రోబో శంకర్ గ్రామాల్లో & టెలివిజన్‌లో జరిగే ప్రదర్శనలలో రోబోట్ చర్యలను ప్రదర్శించడం ద్వారా ఆయన రోబో అనే పేరును సంపాదించాడు. ఆయన వృత్తి పరంగా 1997 నుండి సినిమాల్లో పని చేస్తున్నాడు. అయితే కోలీవుడ్ స్టార్ కమెడియన్, నటుడు రోబో శంకర్ (46) హఠాన్మరణం అందరనీ కలిచివేసింది. లివర్ క్యాన్సర్ తో బాధపడుతోన్న అతను ఒక సినిమా సెట్‌లో స్పృహ తప్పి పడిపోయాడు.
చిత్ర బృందం వెంటనే ఆయన్ను ఆస్పత్రికి తీసుకెళ్లగా గురువారం చికిత్స పొందుతూ మరణించాడు. దీంతో నటుడి కుటుంబ సభ్యులందరూ తీవ్ర విషాదంలో మునిగిపోయారు. తమిళనాడు రాష్ట్ర ఉపముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్, నటుడు ధనుష్, శివకార్తికేయన్ తదితర రాజకీయ, సినీ ప్రముఖులు రోబో శంకర్ ఇంటికెళ్లి అతని భౌతిక కాయానికి నివాళులర్పించారు.
అలాగే మక్కళ్ నీది మయ్యం పార్టీ నేత కమలహాసన్, అన్నాడీఎంకే అధ్యక్షుడు పళనిస్వామి తదితరులు సోషల్ మీడియా వేదికగా ప్రగాఢ సంతాపం తెలిపారు రోబో శంకర్ భౌతిక కాయానికి శుక్రవారం సాయంత్రం స్థానిక వలసరవాక్కంలోని శ్మశానంలో అంత్యక్రియలు జరిగాయి. ఈ సందర్భంగా నటుడికి వినూత్నంగా నివాళి అర్పించింది భార్య ప్రియాంక. మనసులోని ఆవేదనను డ్యాన్స్ రూపంలో వ్యక్తం చేసింది.
రోబో డ్యాన్స్‌తోనే బాగా ఫేమస్ అయ్యాడు శంకర్. ఆ తర్వాత అతని పేరు రోబో శంకర్ గా స్థిర పడిపోయింది. ఈ క్రమంలోనే తన భర్త భౌతిక కాయం వెంట డ్యాన్స్ చేస్తూ నివాళి అర్పించింది ప్రియాంక. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. దీనిని చూసిన వారందరూ కన్నీరుమున్నీరవుతున్నారు. దేవుడు ఆమెకు మనో ధైర్యం ప్రసాదించాలని కోరుకుంటున్నారు.