మీ కాళ్లపై ఇలాంటి చారలు కనిపిస్తున్నాయా..! మీరు ఎంత ప్రమాదంలో ఉన్నారో తెలుసుకోండి.

divyaamedia@gmail.com
2 Min Read

మన శరీరంలోని ధమనులు గుండె నుండి మిగిలిన కణజాలాలకు రక్తాన్ని తీసుకువెళతాయి మరియు సిరలు శరీరంలోని మిగిలిన భాగాల నుండి మీ గుండెకు రక్తాన్ని తిరిగి ఇస్తాయి, తద్వారా రక్త పునర్వినియోగం ఉంటుంది. అయితే కాళ్లలో ఉబ్బిన సిరలు (వెరికోస్ వెయిన్స్) సమస్య ఇటీవల చాలామందిలో కనిపిస్తుంది. సిరల గోడలు బలహీనపడటం, వాటిలోని కవాటాలు సరిగ్గా పనిచేయకపోవడం వల్ల రక్తం గుండె వైపు వెళ్లక, కాళ్లలోనే నిలిచిపోతుంది.

దీనివల్ల సిరలు ఉబ్బి, మెలికలు తిరుగుతాయి. 30 ఏళ్లు దాటిన వారిలో ఇది తరచు కనిపిస్తుంది. 50 ఏళ్లు పైబడిన వారిలో ఈ సమస్య మరింత ఎక్కువ. పురుషుల కంటే మహిళల్లో వెరికోస్ వెయిన్స్ వచ్చే అవకాశాలు అధికం. గర్భధారణ సమయంలో హార్మోన్ల మార్పులు, రుతుక్రమం, రుతువిరతి దీనికి కారణం. మహిళల హార్మోన్లు సిరల గోడలను సడలిస్తాయి. నర్సులు, ఉపాధ్యాయులు, ట్రాఫిక్ పోలీసులు, సెక్యూరిటీ గార్డులు ఇలా ఎక్కువ సమయం నిలబడి పనిచేసేవారి కాళ్లలో రక్తం నిలిచిపోయి, సిరలపై ఒత్తిడి పెరుగుతుంది.

వంశపారంపర్యంగా ఈ సమస్య వచ్చే అవకాశం 10 శాతం ఉంటుంది. అధిక బరువు వల్ల కాళ్ల సిరలపై ఒత్తిడి పెరుగుతుంది. అవును, వెరికోస్ వెయిన్స్ కు పరిష్కారం ఉంది. ఇది పూర్తిగా నయం కాకపోయినా, లక్షణాలు తగ్గించి, సమస్య తీవ్రం కాకుండా చూడవచ్చు. చికిత్సా విధానాలు వ్యాధి తీవ్రత బట్టి మారుతాయి. సాధారణ చిట్కాలు, నివారణ మార్గాలు:-వ్యాయామం.. క్రమం తప్పకుండా వ్యాయామం చేయండి. నడక, సైక్లింగ్, ఈత వంటివి మంచివి.

రోజుకు కనీసం 30 నిమిషాలు నడవండి. రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. ఆరోగ్యకరమైన బరువు.. అధిక బరువు తగ్గించుకుంటే సిరలపై ఒత్తిడి తగ్గుతుంది. కాళ్లు పైకెత్తడం.. విశ్రాంతి తీసుకునేటప్పుడు కాళ్లను గుండె స్థాయి కన్నా కొద్దిగా పైకి ఉంచండి. రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. కంప్రెషన్ సాక్స్.. కంప్రెషన్ మేజోళ్లు ధరిస్తే సిరలు కుదించుకుపోయి, రక్త ప్రవాహానికి సాయపడతాయి. వ్యాధి మరింత తీవ్రం కాకుండా ఇది నిరోధిస్తుంది.

ఆహారం.. అధిక పీచుపదార్థాలు, తక్కువ సోడియం ఉన్న ఆహారం తీసుకోండి. మలబద్ధకం తగ్గుతుంది. సిరలపై ఒత్తిడి తగ్గుతుంది. ఉప్పు ఎక్కువగా ఉండే ఆహారాలు మానుకోండి. వైద్య చికిత్సలు:- స్క్లెరోథెరపీ.. సిరలోకి ఓ ద్రావణాన్ని ఇంజెక్ట్ చేస్తారు. ఇది సిర మూసుకుపోయేలా చేస్తుంది. చిన్న వెరికోస్ వెయిన్స్ కు ఇది ఉపకరిస్తుంది. లేజర్ ట్రీట్‌మెంట్.. లేజర్ కిరణాలతో సిరలను మూసివేస్తారు.

చిన్న సిరలు, స్పైడర్ వెయిన్స్ కు ఇది వాడతారు. వెయిన్ స్ట్రిప్పింగ్.. ఇది శస్త్రచికిత్సా పద్ధతి. దెబ్బతిన్న సిరలను తొలగిస్తారు.లేజర్ అబ్లేషన్/రేడియోఫ్రీక్వెన్సీ అబ్లేషన్: ఈ ప్రక్రియలో లేజర్ లేదా రేడియోఫ్రీక్వెన్సీ శక్తిని ఉపయోగించి సిరలను మూసివేస్తారు.

Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *