కృష్ణంరాజు.. విజయనగర సామ్రాజ్య వారసులు. అందుకే వారి పేరు వెనకాలు రాజు
అనేది ఉంటుంది. వీరికి అనేక ఆస్తులున్నాయి. వేల ఎకరాల భూములున్నాయి. అయినా నటన అంటే పిచ్చి కృష్ణంరాజుకి. మొదటగా ఫోటో జర్నలిస్ట్ గా కెరీర్ని ప్రారంభించి, ఆ తర్వాత సినిమాల్లోకి వెళ్లారు. సినిమా రంగంలో ఆయన సృష్టించిన సంచలనాలు ఎలాంటివో తెలిసిందే. అయితే హీరోగా.. విలక్షణ నటుడిగా… ప్రతినాయకుడిగా మెప్పించిన కృష్ణం రాజు దాదాపు 187 చిత్రాల్లో నటించారు.
అయితే కృష్ణం రాజు వ్యక్తిగత జీవితం గురించి చాలా తక్కువ మందికి తెలుసు. కృష్ణంరాజుకు శ్యామలదేవి కంటే ముందే సీతదేవితో వివాహం జరిగింది. కోట సంస్థానాధీశుల వంశస్తులు రాజా కలిదిండి దేవి ప్రసాద వరాహా వెంకట సూర్యనారాయణ కుమార లక్ష్మీ కాంత రాజ బహుద్దూర్ (గాంధీబాబు), సరస్వతీ దేవిల కుమార్తే సీతాదేవిని కృష్ణంరాజు 1969లో వివాహం చేసుకున్నారు. అయితే 1995లో ఆమె రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. దీంతో కొన్నాళ్లపాటు కృష్ణంరాజు డిప్రెషన్లోకి వెళ్లిపోయారట.
ఆయన మానసిక పరిస్థితి గమనించిన కుటుంబసభ్యులు రెండోపెళ్లి ఒత్తిడి తీసుకువచ్చి.. 1996లో తూర్పు గోదావరి జిల్లా తునికి చెందిన శ్యామలాదేవితో కృష్ణంరాజుకు రెండవ పెళ్లి చేశారు. వీరికి ప్రసీది, ప్రకీర్తి, ప్రదీప్తి ముగ్గురు కుమార్తెలు. వీళ్లు మాత్రమే కాకుండా మొదటి భార్య సీతాదేవి కుమార్తె కూడా కృష్ణంరాజు వద్దే ఉంటుంది. అలాగే మరో అమ్మాయిని కూడా దత్తత తీసుకున్నారు. ప్రస్తుతం కృష్ణంరాజు.. శ్యామలాదేవి దంపతులు ఐదుగురు ఆడపిల్లలకు తల్లిదండ్రులుగా ఉంటున్నారు.