రెండో ప్రపంచ యుద్ధంలో జపాన్‌పై చైనా సాధించిన విజయానికి 80 ఏళ్లు పూర్తయిన సందర్భంగా బీజింగ్‌లో ఈ సైనిక ప్రదర్శనను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరయ్యేందుకు కిమ్ నిన్న తన ప్రత్యేక బుల్లెట్ ప్రూఫ్ రైలులో బీజింగ్ చేరుకున్నారు. రైలు దిగే సమయంలో ఆయన వెంటే కిమ్ జు యే కూడా ఉన్నట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి. అయితే ఆమె పేరు మొదట 2013లో అమెరికన్ బాస్కెట్‌బాల్ ఆటగాడు డెన్నిస్ రాడ్మాన్ ద్వారా ప్రపంచానికి తెలిసింది.
అతను పియోంగ్‌యాంగ్‌లో కిమ్ కుటుంబంతో గడిపిన సమయంలో ఆమెను “బేబీ జు ఏ” అని పిలిచాడు. అయితే, ఉత్తర కొరియా ప్రభుత్వం ఆమె పేరు లేదా వయస్సును అధికారికంగా ధృవీకరించలేదు. 2022 నవంబర్‌లో కిమ్ జు ఏ… తన తండ్రితో కలిసి ఒక ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ మిస్సైల్ (ICBM) ప్రయోగంలో మొదటిసారి బహిరంగంగా కనిపించింది. అప్పటి నుంచి, ఆమె సైనిక పరేడ్‌లు, రాష్ట్ర విందులు, దౌత్య సమావేశాలలో తన తండ్రితో కలిసి కనిపిస్తోంది. ఉత్తర కొరియా దేశ మీడియా ఆమెను మొదట “ప్రియమైన” “విలువైన” కూతురిగా పిలిచింది.

ఆ తరువాత “గౌరవనీయ” అనే పదాన్ని యాడ్ చేసింది. ఇప్పుడు ఆమెను పిలిచిన ప్రతిసారీ ఆ పదం వాడుతోంది. సాధారణంగా కిమ్ జాంగ్ ఉన్ వంటి అత్యంత గౌరవనీయ వ్యక్తులకు మాత్రమే ఈ పదాన్ని ఉపయోగిస్తారు. 2024 మార్చిలో, ఆమెను “గొప్ప మార్గదర్శక వ్యక్తి”గా సూచించారు. ఇది ఆమె భవిష్యత్ నాయకత్వ పాత్రకు సంకేతంగా చెబుతున్నారు. 2025 సెప్టెంబర్‌లో, కిమ్ జు ఏ… తన తండ్రితో కలిసి చైనాలో జరిగిన ఒక పెద్ద సైనిక పరేడ్‌లో కనిపించి.. తన మొదటి అంతర్జాతీయ పర్యటనను చేసింది.
ఇది ఆమె వారసురాలిగా ఉద్భవిస్తున్న స్థితిని మరింత బలపరుస్తోంది. దక్షిణ కొరియా జాతీయ గూఢచార సంస్థ (NIS) ఆమెను కిమ్ జాంగ్ ఉన్.. అత్యంత సంభావ్య వారసురాలిగా గుర్తించింది. ఆమెది ఇంకా చిన్న వయస్సే. పైగా ఉత్తర కొరియా సంప్రదాయిక పురుషాధిక్య సమాజం ఆమె నాయకత్వాన్ని ఆమోదించడం అనేది సవాళ్లతో కూడిన అంశంగా కొంతమంది విశ్లేషకులు భావిస్తున్నారు. ఆమె పబ్లిక్ ప్రొఫైల్ గణనీయంగా పెరిగింది. ఆమె సైనిక, రాజకీయ కార్యక్రమాలలో తరచూ కనిపిస్తూ, తన తండ్రి పక్కన నిలబడి ఉన్న ఫొటోలు ఆ దేశ మీడియాలో కనిపిస్తున్నాయి.

కిమ్ జు ఏ గురించి ఆసక్తికర విషయాలు కూడా వెలుగులోకి వస్తున్నాయి. ఆమె పియోంగ్‌యాంగ్‌లో ఇంట్లోనే ఉంటూ చదువుకుంటున్నట్లు NIS నివేదించింది. ఆమె హార్స్ రేసింగ్ బాగా చేస్తుందనీ, స్కీయింగ్, స్విమ్మింగ్ వంటి క్రీడల్ని ఇష్టపడుతుందని తెలిసింది. ఆమె ఎత్తు, శారీరక అభివృద్ధి గురించి కూడా చర్చలు జరుగుతున్నాయి. ఆమె తన వయస్సు పిల్లలు ఉండే ఎత్తు కంటే.. చాలా ఎక్కువ ఎత్తుగా కనిపిస్తుందని అంటున్నారు. ఉత్తర కొరియాలో పోషకాహార లోపం ఉన్న సామాన్య పిల్లలతో పోల్చితే.. ఆమె సంపూర్ణ పోషణతో పెరుగుతోందని విశ్లేషకులు అంటున్నారు.
కిమ్ జు ఏ వారసత్వం గురించి కొన్ని వివాదాలు కూడా ఉన్నాయి. ఉత్తర కొరియా పురుషాధిక్య సంస్కృతి కారణంగా, ఒక మహిళా నాయకురాలిని ఆమోదించడం సవాలుగా ఉండవచ్చని కొందరు నిపుణులు భావిస్తున్నారు. అదనంగా, ఆమె ఇంకా యుక్తవయస్సులో ఉన్నందున, ఆమె రాజకీయ నైపుణ్యం లేదా నాయకత్వ సామర్థ్యం గురించి కచ్చితంగా చెప్పడం కష్టం. దక్షిణ కొరియా గూఢచార సంస్థ మాజీ డైరెక్టర్ పార్క్ జీ-వాన్… ఆమె వారసత్వం గురించి సందేహాలు వ్యక్తం చేశారు.

గతంలో వారసులను బహిరంగంగా చూపించలేదనీ, ఆమె యుక్తవయస్సు కారణంగా.. భవిష్యత్తులో ఆమెను ఫైనల్ చెయ్యకపోయినా ఆశ్చర్యం అక్కర్లేదని తెలిపారు. కిమ్ జు ఏ గురించి జరుగుతున్న ప్రచారం, ఆమెకు ఇస్తున్న ప్రధాన్యం వంటివి చూస్తే.. కిమ్ తర్వాత.. ఆ పగ్గాలు చేపట్టేది ఆమే అనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఆమె ఇటీవలి చైనా పర్యటన, రాజకీయ, సైనిక కార్యకలాపాల్లో తండ్రితోపాటూ ఆమె కూడా పాల్గొంటుండటం కూడా ఈ వాదనను బలపరుస్తోంది. ఈ పరిణామాలు ఉత్తర కొరియా నాయకత్వ భవిష్యత్తుపై కొత్త చర్చలకు దారితీస్తున్నాయి. ఆమె పాత్రపై రాబోయే సంవత్సరాలలో మరింత స్పష్టత రావచ్చు.