భారతదేశంలో కిడ్నీ సంబంధిత వ్యాధిగ్రస్తుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుండటంతో మరింత ఆందోళన వ్యక్తం అవుతోంది. ‘ది లాన్సెట్ గ్లోబల్ హెల్త్’ నివేదిక ప్రకారం.. మన దేశ జనాభాలో 10 శాతం మంది దీర్ఘకాలిక మూత్రపిండాల వ్యాధులతో బాధపడుతున్నారని నివేదిక ద్వారా తెలుస్తోంది. వీటన్నింటికి కారణం మనం కిడ్నీలు ఆరోగ్యంగా ఉండేందుకు ప్రత్యేక శ్రద్ద తీసుకోకపోవడమే.
మూత్రపిండాల వ్యాధికి ప్రధాన లక్షణాలు:- ముఖం వాపు.. ఉదయం నిద్ర లేవగానే కళ్లు, ముఖం వాపుగా అనిపించడం మూత్రపిండాల సమస్యకు ఒక ముఖ్య సంకేతం. కిడ్నీలు సరిగా పనిచేయనప్పుడు శరీరంలో నీరు నిల్వ ఉంటుంది. దీనివల్ల ముఖం, కాలు, చేతులు వాస్తాయి. మూత్రంలో నురుగు.. మూత్రంలో నిరంతరం నురుగు కనిపించడం మూత్రపిండాల గ్లోమెరులర్ దెబ్బతిందని సూచిస్తుంది.

ఇది మూత్రంలో ప్రోటీన్లు ఎక్కువగా ఉన్నాయని సూచిస్తుంది. ఎండిపోయిన చర్మం, దురద.. మూత్రపిండాలు సరిగా పనిచేయకపోతే రక్తం నుంచి విష పదార్థాలు బయటకు వెళ్లవు. ఇది చర్మం పొడిబారడానికి, తీవ్రమైన దురదకు కారణమవుతుంది. మెదడు పనితీరులో మందగింపు (బ్రెయిన్ ఫాగ్).. మూత్రపిండాలు వ్యర్థాలను బయటకు పంపనప్పుడు, ఆ వ్యర్థాలు మెదడును ప్రభావితం చేస్తాయి.
దీనివల్ల అలసట, ఏకాగ్రత లోపం వంటి సమస్యలు వస్తాయి. నోటి నుంచి దుర్వాసన.. మూత్రపిండాలు దెబ్బతిన్నప్పుడు యూరియా వంటి వ్యర్థాలు పేరుకుపోతాయి. అవి నోటిలోని లాలాజలంతో కలిసి అమ్మోనియాగా మారి దుర్వాసనకు కారణమవుతాయి. డయాబెటిస్, అధిక రక్తపోటు ఉన్నవారికి మూత్రపిండాల వ్యాధులు వచ్చే ప్రమాదం ఎక్కువ. అందుకే ఈ లక్షణాలను గమనిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.