హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న కావేరి ట్రావెల్స్‌కు చెందిన ఈ ప్రైవేట్ బస్సు.. బైక్‌ను బలంగా ఢీకొట్టింది. ప్రమాదం తర్వాత బస్సు బైక్‌ను దాదాపు 300 మీటర్లు లాక్కెళ్లింది. ఈ ఘటనలో బైక్ పెట్రోల్ ట్యాంక్ పగిలిపోయి, బైక్‌ను బస్సు లాక్కెళ్లడం వల్ల జరిగిన ఘర్షణతో మంటలు చెలరేగి బస్సుకు వ్యాపించాయి. బస్సులో మంటలు వేగంగా వ్యాపించడంతో ప్రయాణికులు మంటల్లో చిక్కుకుని ప్రాణాలు కోల్పోయారు.
ఇప్పటి వరకు దాదాపు 20 మృతదేహాలను అధికారులు వెలికితీశారు. మృతుల్లో ఇద్దరు చిన్నారులు, పది మంది మహిళలు ఉన్నట్టు సమాచారం. ప్రమాద సమయంలో బస్సులో 43 మంది ఉన్నారు. ప్రమాదం నుంచి 23 మంది క్షేమంగా బయటపడ్డారు. మంటల్లో మృతదేహాలు పూర్తిగా కాలిపోవడంతో వాటిని గుర్తించేందుకు అధికారులు డీఎన్‌ఏ పరీక్షలు నిర్వహిస్తున్నారు.
ఆ తర్వాతే మృతదేహాలను బంధువులకు అప్పగించనున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే బస్సులో నుంచి దూకిన కొందరు ప్రయాణికులకు కాళ్లు, తలకు గాయాలయ్యాయి. వీరిని కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం నలుగురికి వైద్యం అందిస్తున్నారు. ఆసుపత్రిలో బాధితులను పరామర్శించిన ఏపీ హోం మంత్రి అనిత పరామర్శించారు.
ప్రమాదంలో మరణించిన తెలంగాణ కుటుంబాలకు రూ. 5 లక్షలు, గాయపడిన క్షతగాత్రులకు రూ. 2 లక్షల చొప్పున ప్రభుత్వం పరిహారం ప్రకటించింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కూడా మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షలు, గాయపడిన వారికి రూ. 50 వేల చొప్పున పరిహారం ప్రకటించారు. బస్సు ఫిట్‌నెస్, అనుమతులు ఒడిశా పరిధిలోకి వస్తాయని అధికారులు తెలిపారు.
