దివంగత నటీమణి జయలలిత. 1965లో ‘కథానాయకుడు’ అనే సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయమైన ఈమె.. ఆ తర్వాత ఎంజీఆర్, ఎన్టీఆర్ వంటి దిగ్గజ హీరోల సరసన నటించి మెప్పించింది. అయితే తాజాగా సీబీఐ కోర్టు జయలలిత నుంచి స్వాధీనం చేసుకున్న 27 కిలోల నగలు, 1562 ఎకరాల భూమిని ఫిబ్రవరి 14- 15 తేదీలలో తమిళనాడు అవినీతి నిరోధక శాఖకు అప్పగించాలని ఆదేశించింది. నగలు సహా పత్రాలను తీసుకెళ్లడానికి ఆదేశాలు వచ్చాయి.
దీంతో తమిళనాడు నుంచి ఏసీబీ అధికారులు పెట్టెలతో బెంగళూరుకు రావాలని ఆభరణాలను భద్రంగా తీసికువెళ్లేందుకు తగినంత భద్రత ఉండాలని.. ఆభరణాలను అంచనా వేయడానికి అప్రైజర్లు తప్పనిసరిగా హాజరు కావాలని అధికారులు సూచించారు.. ప్రతిదీ సరిచూసుకున్న తర్వాతే వాటిని ఏసీబీ అప్పగించాలని కోర్టు ఆదేశించింది. దీనికి సంబంధించిన భద్రతా పనులను కర్ణాటక పోలీసులు బాధ్యత తీసుకోవాలని ఆదేశించింది. శుక్రవారం బెంగళూరు లో తమిళనాడు నుంచి వచ్చిన అధికారులకు..
జయలలితకు చెందిన ఆభరణాలు, వస్తువులు.. ఆస్తుల పత్రాలను అప్పగించారు. జయలలిత ఆభరణాలను తిరిగి ఇచ్చే ప్రక్రియలో తమిళనాడు హోం శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, ఐజిపి విజిలెన్స్ హాజరయ్యారు. ఆభరణాలను తీసుకెళ్లడానికి 6 ట్రంక్‌లను తీసుకురాగా కోర్టు ఆదేశాలతో వీడియోగ్రాఫర్, ఫోటోగ్రాఫర్‌ను తీసుకువచ్చారు. అధికారులు ఈరోజు కోర్టులోని వస్తువులను స్టాక్ చేస్తున్నారు. కర్ణాటకకు రూ. 5 కోట్ల వ్యాజ్య రుసుము ఇంకా చెల్లించాల్సి ఉంది. పట్టుచీరల విలువ కట్టేందుకు SPP కిరణ్ టెక్స్‌టైల్స్ ప్రతినిధులు, న్యాయవాదులు హాజరయ్యారు.
జయలలితకు చెందిన వస్తువుల్లో 468 రకాల బంగారం, వజ్రాలు పొదిగిన ఆభరణాలు ఉన్నాయి. 700 కిలోల బరువున్న వెండి ఆభరణాలు, 740 ఖరీదైన చెప్పులు, 10344 పట్టు చీరలు, 250 శాలువాలు, 12 రిఫ్రిజిరేటర్లు, 10 టీవీల సెట్లు, 8 VCRలు, 1 వీడియో కెమెరా, 4 CD ప్లేయర్లు, 2 ఆడియో డెక్‌లు, 24 టూ-ఇన్-వన్ టేప్ రికార్డర్, 1040 వీడియో క్యాసెట్లు, 3 ఇనుప లాకర్లు ఉన్నాయి.