ఐ బొమ్మ సినీ పైరసీని రవి ఒక్కడే చేశాడని నిర్ధారించుకున్న పోలీసులు..పైరసీ ద్వారా సంపాదించిన మొత్తంలో 30 కోట్లకు సంబంధించిన బ్యాంకు లావాదేవీ వివరాలను సేకరించారు. అంతేకాకుండా.. పైరసీ కేసు దర్యాప్తులో పోలీసులు మరింత లోతుగా వెళ్తున్నారు.. ఇంత పెద్ద వలయాన్ని నిర్వహించిన రవిపై పోలీసులు ఇప్పటివరకు రెండు విడతల్లో ఎనిమిది రోజులపాటు కస్టడీ తీసుకుని విచారణ జరిపిన విషయం తెలిసిందే.
అయితే కొత్త సినిమాలను పైరసీ చేస్తూ, సినీ పరిశ్రమకు కోట్లాది రూపాయల నష్టాన్ని మిగిల్చిన ‘ఐ-బొమ్మ’ వెబ్‌సైట్ నిర్వాహకుడు ఇమ్మడి రవిని ఇటీవల సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. కస్టడీలోకి తీసుకుని విచారించగా, అనేక ఆసక్తికరమైన, విస్తుపోయే అంశాలు బయటపడ్డాయి. పోలీసుల ఆఫర్.. రవి తిరస్కరణ : రవి సాంకేతిక నైపుణ్యం, పైరసీ నెట్‌వర్క్‌ను నడిపిన తీరును చూసి విచారణ అధికారులు ఆశ్చర్యపోయినట్లు సమాచారం.

అతని తెలివితేటలను మంచి మార్గంలో ఉపయోగించుకోవాలనే ఉద్దేశంతో, వారు ఓ అనూహ్యమైన ప్రతిపాదనను రవి ముందు ఉంచినట్లు తెలిసింది. “నీకు టెక్నికల్‌గా మంచి పట్టుంది. పోలీసు శాఖలోకి వచ్చి, సైబర్ క్రైమ్ విభాగంలో పనిచేస్తావా? మంచి జీతం కూడా ఇస్తాం,” అని అధికారులు ఆఫర్ చేసినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. అయితే, ఈ బంపర్ ఆఫర్‌కు రవి ఏమాత్రం చలించకుండా, సున్నితంగా తిరస్కరించినట్లు తెలిసింది.
భవిష్యత్ ప్లాన్.. కరేబియన్‌లో ‘ఐ-బొమ్మ’ రెస్టారెంట్.. “నీ ఐ-బొమ్మ కథ ముగిసింది, మరి భవిష్యత్ ఏంటి?” అని పోలీసులు ప్రశ్నించగా, రవి చెప్పిన సమాధానం విని అధికారులు అవాక్కయ్యారట. కొత్త వ్యాపారం.. “ఈ కేసు పూర్తవగానే కరేబియన్ దీవులకు వెళ్లి, అక్కడ ఓ రెస్టారెంట్ పెడతాను. తెలంగాణ, ఆంధ్రా వంటకాలను అక్కడి ప్రజలకు పరిచయం చేస్తాను,” అని రవి చెప్పినట్లు తెలిసింది. పేరు మాత్రం పాతదే.. రెస్టారెంట్‌కు ఏం పేరు పెడతావని అడగ్గా, ఏమాత్రం తడుముకోకుండా “‘ఐ-బొమ్మ’ పేరే పెడతాను” అని బదులివ్వడంతో పోలీసులు విస్తుపోయారట.
