ఇండియా ఇలా ఇతర దేశాలకు కూడా HMPV వ్యాపిస్తోంది. ఈ వైరస్, కరోనా అంత ప్రమాదకరమైనది కాదు అని చెబుతున్నా.. దీని వ్యాప్తి ఎక్కువగా ఉండటం, దీనికి వ్యాక్సిన్ లేకపోవడం వల్ల ఇది చాలా మందికి సోకుతోంది. ఇది మరో కరోనా అవుతుందా అని ప్రజలు సందేహపడుతున్నారు. అయితే ఇప్పటికీ కరోనా మహమ్మారి చూపిన ప్రభావం, కలిగించిన నష్టం ప్రపంచాన్ని వీడలేదంటే అతిశయోక్తి కాదు. ఇప్పుడు ఐదేళ్ల తర్వాత చైనాలో హ్యూమన్ మెటాప్ న్యూమోవైరస్ కూడా ఇదే తరహా ఆందోళనలు కలిగిస్తోంది. ఈ వైరస్ వ్యాప్తిపై మీడియా నివేదికలు, సోషల్ మీడియా పోస్టులు కొంత సమాచారం షేర్ చేస్తున్నాయి. ఇది పెద్ద ప్రమాదకరం కాదని ప్రభుత్వాలు, వైద్యులు కూడా భరోసా ఇస్తున్నారు.
కానీ అందరూ ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏం చెబుతుందని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నిరీక్షణకు తెరదించుతూ బుధవారం జెనీవాలోని డబ్ల్యూహెచ్‌ఓ ప్రధాన కార్యాలయంలో ప్రతినిధి డాక్టర్ మార్గరెట్ హారిస్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. విలేకరులతో ఆమె మాట్లాడుతూ, ‘ఇటీవల సీజనల్ ఫ్లూ, RSV, SARS-CoV-2 (కరోనావైరస్), HMPV, రైనోవైరస్‌ల కేసులు చైనాలో పెరిగాయి. హ్యూమన్ మెటాప్ న్యూమోవైరస్ గురించి భయాందోళన చెందాల్సిన అవసరం లేదు. కాలానుగుణ మార్పుల సమయంలో ఇటువంటి అంటు వ్యాధులు వ్యాప్తి చెందుతాయి. ఇది ప్రతి సంవత్సరం జరుగుతుంది.’ అని వివరించారు.
చైనాలో లంగ్స్ రిలేటెడ్ ఇన్‌ఫెక్షన్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయని, అయినా పరిస్థితులు చేయిదాటలేదని మార్గరెట్ హారిస్ స్పష్టం చేశారు. చైనా నుంచి ఎప్పటికప్పుడు సమాచారం కోరుతున్నామని, హ్యూమన్ మెటాప్ న్యూమోవైరస్ పాతదని, గతేడాది కూడా ఇలాంటి ఇన్ఫెక్షన్లు వచ్చాయని తెలిపారు. అయితే గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది తక్కువ మంది రోగులు ఆస్పత్రిలో చేరారని, చైనా ప్రభుత్వం ఎటువంటి అత్యవసర చర్యలు లేదా ప్రకటనలను అమలు చేయాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. HMPV గురించి WHO ప్రతినిధి ప్రజలకు భరోసా ఇచ్చారు. కొంత కాలంగా తీవ్రత ఎక్కువగా ఉన్నప్పటికీ ఇది కొత్త వైరస్ కాదని, మొదట 2001లో గుర్తించారని, చాలా కాలంగా మానవ సమాజంలో ఉందని తెలిపారు.
ఆమె ఇన్‌ఫెక్షన్ వ్యాప్తి గురించి హెచ్చరిస్తూ, ‘ఈ వైరస్ లక్షణాలు కాలానుగుణ ఫ్లూ లేదా దగ్గు, జలుబు వంటి సమస్యల్లానే ఉంటాయి. అయినప్పటికీ వైరస్ తీవ్రంగా మారవచ్చు. వైరస్ సోకిన వ్యక్తి తీవ్ర అనారోగ్యానికి గురవుతారు. పిల్లలు, వృద్ధులు, బలహీనమైన రోగనిరోధక శక్తి ఉన్నవారు ఎక్కువ ప్రమాదంలో ఉన్నారు. అయితే, హ్యూమన్ మెటాప్ న్యూమోవైరస్ కారణంగా మరణించే అవకాశాలు చాలా తక్కువ.’ అని హామీ ఇచ్చారు.