1990ల్లో వచ్చిన తెలుగు, హిందీ, తమిళ సినిమాల్లో ఓ రేంజ్ కు ఎదిగిన నటుడు అతడు. అలాంటి యాక్టర్ బాలీవుడ్ నటి కరిష్మా కపూర్ వల్లే తాను ప్రాణాలతో ఉన్నట్లు చెప్పడం గమనార్హం. అయితే అక్కడ కూడా ఈ సినిమాలో హీరోగా హరీష్ నటించగా.. కథానాయికగా కరిష్మా కపూర్ నటించింది. ఈ మూవీతోనే 33 ఏళ్ల క్రితం బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది కరిష్మా. అయితే ఈ సినిమా షూటింగ్ సమయంలో అనుకోకుండా హరీష్ ప్రమాదంలో పడిపోయాడట. చివరకు అతడు ప్రాణాపాయం నుంచి ఎలా బయటపడ్డాడో తాజాగా కరిష్మా కపూర్ బయటపెట్టింది.
ఇప్పుడిప్పుడే సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన కరిష్మా.. ‘ఆప్కా అప్నా జకీర్’ షోలో పాల్గొంది. ఈ క్రమంలోనే తన మొదటి సినిమా ప్రేమ ఖైదీ షూటింగ్ సమయంలో తన సహనటుడు హరీష్ ప్రాణాలను ఎలా కాపాడిందో చెప్పుకొచ్చింది. “ప్రేమ ఖైదీ సినిమా షూటింగ్ సమయంలో నీటిలో మునిగిపోతున్న నన్ను హరీష్ రక్షించే సన్నివేశాన్ని చిత్రీకరించాల్సి ఉంది. కానీ నిజానికి నేనే అతడిని కాపాడాను. ఈ సీన్‌ని స్విమ్మింగ్ పూల్‌లో చిత్రీకరించాలని అనుకున్నారు. కానీ తనకు ఈత రాదని హరీష్ ఎవరికీ చెప్పలేదు. అయితే అక్కడ 4 అడుగుల లోతు వరకే వెళ్లాలి.
కానీ మేమిద్దరం ఆ సీన్ లో లీనమైపోయి 5 అడుగుల లోతు వరకు వెళ్లాం. నేను రక్షించు, రక్షించు అని అరుస్తున్నాను. అప్పుడే నా వెనక నుంచి నన్ను రక్షించు అనే వాయిస్ వినిపించింది. వెంటనే వెనక్కి తిరిగి చూసేసరికి హరీష్ మునిగిపోతూ కనిపించాడు. వెంటనే అతడి వద్దకు వెళ్లి.. చేతులు పట్టుకొని లాక్కొచ్చాను. నా ఫస్ట్ మూవీలో హీరో నా ప్రాణాన్ని కాపాడాలి.. కానీ నిజానికి నేనే హీరో ప్రాణాలను కాపాడాను” అంటూ చెప్పుకొచ్చింది. 1990లో తెలుగులో ప్రేమ ఖైదీ సినిమా విడుదలై భారీ విజయాన్ని అందుకుంది.
ఈ చిత్రానికి తెలుగులో ఇవీవీ సత్యనారాయణ దర్శకత్వం వహించగా.. ఇదే చిత్రాన్ని నిర్మాత డి . రామానాయుడు ప్రేమ్ ఖైదీ పేరుతో హిందీలో రీమేక్ చేశారు. ఈ సినిమా తర్వాత హరీష్ తెలుగులో అనేక చిత్రాల్లో నటించాడు. కొండవీటి సింహం, రౌడీ ఇన్స్పెక్టర్, పెళ్లాం చెబితే వినాలి, కొండపల్లి రత్త, గోకులంలో సీత, మనవరాలి పెళ్లి వంటి చిత్రాల్లో నటించాడు. 2017 వరకు సినిమాల్లో యాక్టివ్ గా ఉన్న హరీష్ ఆ తర్వాత సినిమాలకు దూరమయ్యాడు.