గుండెపోటును వైద్యపరంగా మయోకార్డియల్ ఇన్ఫార్క్షన్ అంటారు. ఈ సమస్య వస్తే, అది గుండెకు రక్త సరఫరా అకస్మాత్తుగా ఆగిపోయే తీవ్రమైన అత్యవసర పరిస్థితి. అంతే కాదు, పరిశోధన ప్రకారం, ప్రతి 40 సెకన్లకు ఒక వ్యక్తి గుండెపోటుకు గురవుతున్నారని అంచనా.. ఇప్పుడు ఈ సమస్య చిన్నవారిలో అంటే.. యువతలో కూడా పెరుగుతుండటం.. ఆందోళన కలిగిస్తోంది.
తక్కువ వయసులో చాలా మంది గుండెపోటు కారణంగా ప్రాణాలు కోల్పోతుండటంతో చాలా కుటుంబాలు శోకసంద్రంలో మునిగిపోతున్నాయి. అయితే డాక్టర్ లండన్ ప్రకారం, ఆస్పిరిన్‌ను నమలడం వల్ల అది రక్తంలోకి త్వరగా చేరుకుంటుంది. ఆస్పిరిన్ రక్తం గడ్డకట్టడాన్ని నిరోధిస్తుంది. గుండెపోటు సమయంలో, రక్తం గడ్డకట్టడం వల్ల గుండె కండరాలకు రక్త ప్రవాహం ఆగిపోతుంది.

ఈ పరిస్థితిలో ఆస్పిరిన్ తీసుకోవడం చాలా కీలకం. ఆస్పిరిన్‌ను నమలడం వల్ల అది త్వరగా రక్తంలో కలిసి, మరిన్ని రక్తం గడ్డలు ఏర్పడకుండా నిరోధిస్తుంది. దీనివల్ల గుండెపోటు వల్ల జరిగే నష్టం తగ్గుతుంది. డాక్టర్ లండన్ కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలను కూడా చెప్పారు. ఆస్పిరిన్‌కు మీకు అలెర్జీ ఉంటే, లేదా రక్తస్రావం సమస్యలు ఉంటే, లేదా వైద్యులు ఆస్పిరిన్ తీసుకోకూడదని చెబితే, దానిని తీసుకోకండి.
సమయం చాలా ముఖ్యం.. గుండెపోటు లక్షణాలు కనిపించిన ఒకటి నుంచి నాలుగు గంటల లోపల ఆస్పిరిన్ తీసుకుంటే ఎక్కువ ప్రయోజనం ఉంటుంది. ఇది గుండె కండరాల నష్టాన్ని తగ్గించి, మరణాల రేటును సుమారు 23 శాతం తగ్గిస్తుంది. డాక్టర్ లండన్ ప్రకారం, కేవలం ఆస్పిరిన్‌ను నమలడం అనే చిన్న చర్య, ప్రాణాలను రక్షించడంలో చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది.