ప్రేమ అంటే ఒక వ్యక్తి లేదా వస్తువు పట్ల బలమైన ఆకర్షణ, అనురాగం, ఆప్యాయత, అభిమానం మరియు నిబద్ధత కలిగిన ఒక లోతైన అనుభూతి. ఇది కేవలం ఒక భావోద్వేగం మాత్రమే కాకుండా, రక్షణ, సాన్నిహిత్యం, నమ్మకం వంటి ప్రవర్తనలను కూడా కలిగి ఉంటుంది. అయితే నాందేడ్ నగరంలోని జునాగంజ్ ప్రాంతానికి చెందిన సక్షం టేట్ అనే యువకుడు, ఆంచల్ అనే యువతిని ప్రేమించాడు. ఈ ప్రేమ వ్యవహారం ఆంచల్ కుటుంబానికి తెలిసింది.
ఇరువురి కులాలు వేర్వేరు అని, తన సోదరితో మాట్లాడవద్దని ఆంచల్ సోదరుడు.. సక్షం టేట్ను హెచ్చరించారు. తర్వాత.. అతడిని హత్య చేయాలని నిర్ణయించుకున్నారు. గురువారం ఆంచల్ తండ్రి గజానన్తో పాటు సోదరులు సాహిల్, హిమేష్.. సక్షం టేట్ను హత్య చేశారు. తుపాకీతో మూడు రౌండ్లు కాల్పులు జరిపి.. ఆ తర్వాత రాళ్లతో కొట్టి దారుణంగా హత్య చేశారు. మృతుడి తల్లి ఫిర్యాదు ఆధారంగా యువతి తల్లిదండ్రులు, ఇద్దరు సోదరులతో పాటు ఎనిమిది మందిపై కేసు నమోదైంది.

పోలీసులు కొన్ని గంటల్లోనే నిందితులందరినీ అరెస్టు చేశారు. హత్యకు రెండు గంటల ముందు.. యువతి తల్లి సక్షమ్ ఇంటికి వెళ్లి అతన్ని బెదిరించింది. కానీ పుట్టింటివారు ఇంత దారుణానికి తెగబడతారని అంచల్ ఊహించలేకపోయింది. ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన సక్షమ్ హత్యను తట్టుకోలేకపోయింది. తల్లిదండ్రులు, సోదరులు ప్రియుడ్ని భౌతికంగా దూరం చేసినా.. అతడే తన భర్త అంటూ ప్రియుడి మృతదేహాన్ని పెళ్లి చేసుకోవడం అక్కడున్న వారి హృదయాలను కదిలించింది.
తన తండ్రి, సోదరులు చేసిన పనికి.. ప్రేమించిన వ్యక్తిని కోల్పోయి అంచల్ శిక్ష అనుభవిస్తోంది. తన ప్రేమను చిదిమేసిన వారిని ఉరి తీయాలని డిమాండ్ చేస్తోంది. ప్రియుడిని చంపి తన తండ్రి, సోదరులు గెలిచామని భావిస్తున్నారని, బతికున్నా చనిపోయినా సక్షమే తన భర్తంటోంది అంచల్. ఇకనుంచి అతని ఇల్లే తన ఇల్లని.. సక్షమ్ లేకున్నా అతనింట్లోనే ఉంటానంటోంది. కూతురి ప్రేమను జీర్ణించుకోలేక ప్రియుడిని హతమార్చిన కుటుంబం జైలుకెళ్లింది.
