గూగుల్‌లో ఏమి వెతకాలి ఏమి వెతకకూడదో కూడా తెలిసి ఉండాలి. లేదంటే చాలా ప్రమాదంలో పడుతారు. ఒక్కోసారి మనకు తెలిసి, తెలియకుండా కొన్ని విషయాల గురించి గూగుల్‌లో వెతకడం వల్ల జైలుకు వెళ్లే పరిస్థితులు తలెత్తుతాయి. అందుకే మీరు గూగుల్‌లో ఏ విషయాలను వెతకకూడదో తెలుసుకోవాలి. అయితే కస్టమర్ కేర్ నంబర్లు గూగుల్ సెర్చ్ చేయొద్దు.. ఏదైనా ఫిర్యాదు చేయాలన్నా.. ఇంకేదైనా సమాచారం కావాలన్నా వెంటనే ఆ కంపెనీకి సంబంధించిన కస్టమర్ కేర్ నంబర్ల కోసం గూగుల్‌లో వెతుకుతుంటాం. కానీ అలా గూగుల్ సెర్చ్ చేయడం మంచి పద్ధతి కాదు.
ఇలా ఒక కంపెనీ కాంటాక్ట్ నంబర్ కోసం వెతికినప్పుడు సులువుగా సైబర్ నేరగాళ్ల ట్రాప్‌లో పడిపోతారు. ఎందుకంటే నకిలీ నంబర్లతో వాళ్లు మోసం చేసే అవకాశం ఉంది. కాబట్టి ఏదైనా కాంటాక్ట్ నంబర్ కావాలని అనుకుంటే సదరు కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లి చూసుకోవడమే బెటర్. బ్యాంకింగ్ వైబ్‌సైట్లు.. చాలామంది వెబ్‌సైట్ యూఆర్ఎల్‌ను గూగుల్‌లో వెతుకుతుంటారు. ప్రతిరోజూ మనం వెబ్‌సైట్ యూఆర్ఎల్‌ను కూడా గూగుల్‌లోనే సెర్చ్ చేస్తుంటారు. కానీ ఇలా గూగుల్‌లో యూఆర్ఎల్ వెతికేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఆన్‌లైన్ బ్యాంకింగ్ వెబ్‌సైట్ల విషయంలో అప్రమత్తంగా ఉండాలి.
ఎందుకంటే గూగుల్‌లో నకిలీ ఆన్‌లైన్ బ్యాంకింగ్ వెబ్‌సైట్లు కోకొల్లలుగా ఉంటాయి. పొరపాటున నకిలీ వెబ్‌సైట్ ఓపెన్ చేసి మన లాగిన్ వివరాలు ఎంటర్ చేశామంటే ఇక అంతే సంగతులు. మీ డిటైల్స్ మొత్తం హ్యాకర్ల చేతిలోకి వెళ్లిపోతాయి. కాబట్టి యూఆర్ఎల్‌ను గూగుల్ సెర్చ్ చేసే అలవాటు మానుకోవడం మంచిది. ప్రభుత్వ వెబ్‌సైట్లు.. బ్యాంకింగ్ వెబ్‌సైట్ల తర్వాత సైబర్ మోసగాళ్ల ప్రధాన టార్గెట్ ప్రభుత్వ వెబ్‌సైట్లు అనే చెప్పొచ్చు. కాబట్టి మున్సిపల్ ట్యాక్స్, రిజిస్ట్రేషన్లు ఇలా ఏదైనా సమాచారం కోసం ప్రభుత్వ వెబ్‌సైట్ లింకులను గూగుల్‌లో అసలు వెతకొద్దు.
ప్రభుత్వ వెబ్‌సైట్ల యూఆర్ఎల్ కచ్చితంగా తెలుసుకుని ఓపెన్ చేయాలి. ఈ కామర్స్ వెబ్‌సైట్ల విషయంలోనూ అంతే జాగ్రత్తగా ఉండాలి. అలా కాకుండా గూగుల్‌లో యూఆర్ఎల్ వెతికి సైబర్ నేరగాళ్ల వలలో పడొచ్చు. సోషల్ మీడియా వెబ్‌సైట్లు.. సోషల్ మీడియా వెబ్‌సైట్ల యూఆర్ఎల్‌ను కూడా గూగుల్‌లో వెతకొద్దు. పొరపాటున నకిలీ వెబ్‌సైట్‌లో లాగిన్ అయితే మన వ్యక్తిగత వివరాలు మొత్తం సైబర్ నేరగాళ్ల చేతిలోకి వెళ్లిపోతాయి. అందుకే అడ్రస్ బార్‌లో పూర్తి యూఆర్ఎల్ ఎంటర్ చేసే సోషల్ మీడియా ఖాతాలోకి లాగిన్ అవ్వాలి. వ్యక్తిగత వివరాలు.. కొంతమంది అత్యుత్సాహంతో తమ పేరు, ఫోన్ నంబర్, అడ్రస్, మెయిల్ ఐడీ వంటి వ్యక్తిగత వివరాలను గూగుల్ సెర్చ్ చేస్తుంటారు.
ఇలా మనం సెర్చ్ చేసే ప్రతి విషయాన్ని గూగుల్ స్టోర్ చేసుకుంటుంది. ఇలా స్టోర్ అయినా డేటా సైబర్ నేరగాళ్ల చేతిలో పడితే మాత్రం చిక్కుల్లో పడిపోతాం. అందుకే వ్యక్తిగత వివరాలను గూగుల్‌లో సెర్చ్ చేయవద్దు. యాప్‌లు.. సాఫ్ట్‌వేర్లు.. ఏదైనా యాప్ లేదా సాఫ్ట్‌వేర్లు కావాలంటే చాలామంది గూగుల్‌లో వెతికి ఇన్‌స్టాల్ చేసుకుంటుంటారు. కానీ అవి సురక్షితం కాదు. వీటివల్ల మన వివరాలు హ్యాకర్ల చేతిలోకి వెళ్లిపోయే చాన్స్ ఉంది. కాబట్టి వీలైనంత వరకు ఏదైనా యాప్ లేదా సాఫ్ట్ వేర్ కావాలంటే ఆండ్రాయిడ్ ప్లే స్టోర్, యాపిల్ స్టోర్ లేదా మైక్రోసాఫ్ట్ స్టోర్ నుంచి మాత్రమే డౌన్‌లోడ్ చేసుకొని ఇన్‌స్టాల్ చేసుకోవాలి.
మందులు.. వైద్యం.. కొంతమంది అనారోగ్యానికి గురైనప్పుడు గూగుల్‌లో వెతికి సొంత వైద్యం చేస్తుంటారు. వాళ్ల నలతకు కారణమేంటి? దానికి ఎలాంటి చికిత్స చేయాలి? ఏ ట్యాబ్లెట్లు వేసుకోవాలని వెతుకుతుంటారు. కానీ గూగుల్‌లో దొరికే ప్రతి సమాచారం కరెక్టేనని నమ్మకం లేదు. అలాగే అన్ని మందులు అందరికీ ఒకేలా పనిచేస్తాయని చెప్పలేం. కొన్నిసార్లు సైడ్ ఎఫెక్ట్ కూడా వస్తుంది. అలా పొరపాటున వేరే మందులు వేసుకుంటే ప్రాణాలకే ప్రమాదం ఏర్పడవచ్చు. కాబట్టి ఒంట్లో ఏదైనా నలతగా ఉంటే నేరుగా డాక్టర్‌ను సంప్రదించాలి.
పర్సనల్ ఫైనాన్స్.. ఆరోగ్యం విషయంలో ఒక్కొక్కరి శరీరతత్వం ఒక్కోలా ఉన్నట్టు ఒక్కొక్కరి ఆర్థిక స్థితగతులు ఒక్కోలా ఉంటాయి. కాబట్టి గూగుల్‌లో దొరికే సమాచారం ప్రకారం స్టాక్‌మార్కెట్లలో ఇన్వెస్ట్‌మెంట్లు పెట్టడం కరెక్ట్ కాదు. ఆ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్స్.. మన ఆర్థిక పరిస్థితికి సెట్ అవుతాయో లేదో కూడా చూసుకోవాలి. ఇక చైల్డ్ పోర్నోగ్రఫీ, ఆయుధాల తయారీ, ఆత్మహత్య చేసుకోవడం ఎలా? వంటి విషయాలను కూడా గూగుల్‌లో అసలు వెతకవద్దు. ఎందుకంటే ఇలాంటి పదాలను సెర్చ్ చేస్తే మీ ఐపీ అడ్రస్‌ను ట్రేస్ చేసి మీపై నిఘా పెట్టే అవకాశం ఉంది. కాబట్టి వీటిని కూడా అసలు వెతకవద్దు.