ఇటీవల గోల్డ్ ప్రైస్‌లు భారీగా పెరిగాయి. లోన్స్‌కి డిమాండ్‌కి పెరగడానికి ఇదో పెద్ద కారణం. 2025లో గోల్డ్ ప్రైస్ 44.1% పెరిగింది. 2024 చివరిలో 10 గ్రాములు రూ.78,950 నుంచి 2025 సెప్టెంబర్‌లో రూ.1,13,800కి పెరిగింది. అంటే రుణగ్రహీతలు ఇప్పుడు ఎక్కువ మనీ కోసం, తక్కువ గోల్డ్ తాకట్టు పెడితే చాలు. అయితే రుణం తీసుకోవడం సులభంగా ఉండటంతో ప్రజలు తమ బంగారాన్ని తాకట్టు పెట్టడం పెరుగుతోంది.
కానీ, ఇది అంత తేలికైన విషయం కాదు. అనేక సందర్భాల్లో ఈ రుణం కారణంగా మీరు మీ కుటుంబ బంగారాన్ని పూర్తిగా కోల్పోయే ప్రమాదం ఉంది. గోల్డ్ లోన్‌లు సురక్షితమైనవిగా ప్రజలు భావిస్తారు. బ్యాంకులు బంగారాన్ని తాకట్టుగా తీసుకుని, దానికి బదులుగా రుణం ఇస్తాయి. అందుకే బ్యాంకుకు ఎలాంటి నష్టం ఉండదు.

మీకు కూడా త్వరగా డబ్బు లభిస్తుంది. అలాగే, వ్యక్తిగత రుణంతో పోలిస్తే వడ్డీ రేట్లు కూడా తక్కువ. కానీ, ఈ రుణం ఒక ఉచ్చుగా మారడానికి అనేక అవకాశాలు ఉన్నాయి. గోల్డ్ లోన్‌ల వడ్డీ రేటు 9% నుంచి 20% వరకు ఉంటుంది. ప్రారంభంలో ఇది తక్కువగా ఉన్నట్లు అనిపించినా, మీరు లోన్‌ను తరచుగా పునరుద్ధరించుకుంటూ పోతే వడ్డీ పెరుగుతూ ఉంటుంది.
గోల్డ్ లోన్ తీసుకునేవారు చాలామంది వడ్డీని మాత్రమే చెల్లిస్తూ, అసలు మొత్తాన్ని అలాగే వదిలేస్తారు. చివరికి రుణం పూర్తిగా చెల్లించేందుకు వారి దగ్గర డబ్బు ఉండదు. దీంతో లోన్‌ను మళ్లీ పునరుద్ధరిస్తారు లేదా అదనపు బంగారాన్ని తాకట్టు పెడతారు. ఈ పద్ధతిలో బ్యాంకుకు ఎలాంటి నష్టం ఉండదు.
ఎందుకంటే, బ్యాంకు మీ బంగారాన్ని అమ్మి, దాని ద్వారా వచ్చిన డబ్బును మీ రుణానికి సరిచేసుకుంటుంది. కానీ, మీరు మీ సేవింగ్స్, పెళ్లిలు, ఫంక్షన్ల సమయాల్లో నగలు లేకుండానే ఉండాల్సి వస్తుంది. అందుకే గోల్డ్ లోన్‌ను చివరి అవకాశంగా చూడాలి, కానీ ఒక అలవాటుగా భావించవద్దని నిపుణులు చెప్తున్నారు.