భారతీయుల పాలిట ఒక సెంటిమెంట్, అత్యవసర ఆస్తి. అయితే, గత కొన్ని సంవత్సరాలుగా పసిడి ధరలు ఆకాశాన్నంటుతుండటంతో మధ్యతరగతి వినియోగదారులు బంగారం కొనాలంటేనే భయపడే పరిస్థితి వచ్చింది. అయితే బంగారం ధరలు ఏడాది ప్రారంభం నుండి ఇప్పటివరకు సుమారు 60 శాతం పెరిగాయి. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక పరిస్థితులు అనిశ్చితిలో ఉండటంతో, సెంట్రల్ బ్యాంకులు ఎక్కువగా బంగారం కొనుగోలు చేయడం, అమెరికా ఫెడ్ వడ్డీ రేట్లు తగ్గించడం లాంటి కారణాలతో బంగారం గ్లోబల్ మార్కెట్లో ఔన్స్‌కి 4,000 డాలర్లు దాటి రికార్డు స్థాయికి చేరింది.
భారతదేశంలో ధనత్రయోదశి లాంటి పండుగల కారణంగా బంగారానికి డిమాండ్ ఎక్కువగా ఉంది. కానీ ధరలు ఎక్కువగా ఉండటం వల్ల సాధారణ ప్రజలు ఆభరణాల కొనుగోలుకు వెనకడుగు వేస్తున్నారు. దీనివల్ల రిటైల్ జ్యువెలరీ కంపెనీల అమ్మకాలు బాగా తగ్గిపోయాయి. ఇందువల్ల వినియోగదారులు తక్కువ కేరట్ ఉన్న బంగారం ఆభరణాలు కొనాలని చూస్తున్నారు. ఉదాహరణకి 22కే, 20కే, 18కే, 14కే లాంటివి. ప్రస్తుతం 10 గ్రాములకి బంగారం ధరలు చూస్తే 24 క్యారట్ ధర రూ.1,28,890 కాగా, 22 క్యారట్ గోల్డ్ ధర రూ.1,18,150.
ఇక 18 క్యారట్ ధర రూ.96,670. అంటే 9 క్యారట్ బంగారం ధర 10 గ్రాములకు సుమారు రూ.48,000 ఉంటుంది. అంటే కేవలం రూ.48 వేలకే 9 క్యారట్ బంగారం తులం కొనొచ్చు. జూలై నెలలో భారత ప్రభుత్వం 9కే బంగారానికి హాల్‌మార్క్ అంగీకరించింది. అంటే ఇది ఇప్పుడు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బీఐఎస్) హాల్‌మార్క్ వ్యవస్థలో భాగమైంది. “తక్కువ కేరట్ బంగారం కొనడం వల్ల ఖర్చు తక్కువ అవుతుంది. అందుకే చాలామంది 14కే లేదా 9కే బంగారం వైపు మొగ్గు చూపుతున్నారు” అని ఇండియా బులియన్ అండ్ జ్యూయలర్స్ అసోసియేషన్ ఉపాధ్యక్షురాలు అక్షా కంబోజ్ అన్నారు.
“తక్కువ శాతం బంగారం ఉన్నదంటే అది నాణ్యతలేని బంగారమని అనుకోవడం అవసరం లేదన్నారు. 9కే లేదా 14కే బంగారం డైలీ వేర్ ఫ్యాషన్ ఆభరణాల కోసం బాగుంటుంది. అయితే పెట్టుబడిగా బంగారం కొనాలనుకునేవారు 9కే బంగారం నుండి దూరంగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు. విజయ్ కుప్పా చెప్పినదానిని బట్టి చూస్తే, పెట్టుబడి పెట్టాలంటే 22కే ఆభరణాలు లేదా 24కే నాణేలు, బార్లు, డిజిటల్ బంగారం తీసుకోవడం ఉత్తమం. రిద్దిసిద్ధి బులియన్స్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ పృథ్వీరాజ్ కోఠారి కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. భారతదేశంలో 9కే బంగారం (37.5% శుద్ధత) పెట్టుబడి కోణంలో సరిపోదని చెప్పారు.
