అల్పపీడనం రెండు రోజుల్లో మరింత బలపడుతుందని వెదర్ రిపోర్ట్ అంచనా వేసింది. దీంతో రానున్న మూడు రోజుల్లో ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాలు కురియనున్నాయి. ఈ క్రమంలో ఈ ప్రాంతాల్లో నివసించే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు. అయితే ఆంధ్రప్రదేశ్‌కు మరోసారి భారీ వర్షసూచన జారీ అయింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరో రెండు రోజుల్లో వాయుగుండంగా బలపడనుంది.
ఫలితంగా ఈ నెల 18 నుంచి కోస్తాంధ్ర తీరంలోని జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడనున్నాయి. ఈ నెల 22 వరకూ కోస్తాంధ్రలో వర్షాల హెచ్చరిక ఉంది. ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడా, ఉత్తరాంధ్రలో కొన్ని చోట్ల భారీ వర్షాలు పడనున్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ప్రస్తుతానికి వాయువ్య దిశగా కదులుతోంది. వాయుగుండంగా మారిన తరువాత అటు తమిళనాడు రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడనున్నాయి.
ముఖ్యంగా చెన్నై తీర ప్రాంతాల్లో అతి భారీ వర్షం నమోదు కావచ్చని ఐఎండీ తెలిపింది. ఇవాళ కూడా నెల్లూరు, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో కొన్ని చోట్ల మోస్తరు వర్షాలు పడనున్నాయి. అల్పపీడనం ప్రభావంతో ఎల్లుండి గురువారం వరకు బలమైన ఈదురుగాలులు వీస్తున్నాయి. గంటకు 35 నుంచి 45 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయి.