రైతుల సమస్యలను తెలుసుకున్న రాష్ట్ర ప్రభుత్వం వారికి ఆర్థిక చేయూత ఇవ్వాలని నిర్ణయించింది. హెక్టారుకు రూ.50 వేలు అందించడం వల్ల కనీసం రైతులు పెట్టుబడులు తిరిగి తెచ్చుకునే అవకాశం ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. ఇది ఉల్లి పండించే రైతులకు తాత్కాలిక ఉపశమనం కలిగిస్తుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే ఆంధ్రప్రదేశ్‌లో ఉల్లి రైతులు ఈ ఏడాది తీవ్ర నష్టాలను ఎదుర్కొన్నారు. ముఖ్యంగా కర్నూలు, కడప, అనంతపురం, చిత్తూరు జిల్లాల్లో ఉల్లి సాగు చేసిన రైతులు ధరల భారీ పతనంతో ఇబ్బందులు పడ్డారు.
మార్కెట్‌లో క్వింటాల్ ఉల్లి ధర రూ.200 నుంచి రూ.400 వరకు పడిపోవడంతో, ఎకరాకు రూ.1.2 లక్షలకు పైగా పెట్టుబడి పెట్టిన రైతులు భారీ నష్టాల్లోకి జారుకున్నారు. కొందరు రైతులు పంటను మార్కెట్‌కు తీసుకురాకుండా పొలాల్లోనే పారేశారు లేదా రోడ్లపై పడేశారు. ఈ పరిస్థితుల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రైతుల సమస్యలను గమనించి, తక్షణ చర్యలు తీసుకున్నారు. ముందుగా ఆగస్టు-సెప్టెంబర్ 2025లో మార్క్‌ఫెడ్ ద్వారా క్వింటాల్‌కు రూ.1,200 మద్దతు ధరతో ఉల్లి కొనుగోలు ప్రారంభించారు.

దీని ద్వారా వేల క్వింటాళ్ల ఉల్లిని కొనుగోలు చేసి, రైతుల ఖాతాల్లో నేరుగా డబ్బులు జమ చేశారు. రైతులకు పరిహారం..తర్వాత సెప్టెంబర్ 2025లో భారీ నిర్ణయం తీసుకుని, ఉల్లి సాగు చేసిన ప్రతి హెక్టారుకు రూ.50,000 పరిహారం ప్రకటించారు. ఈ పరిహారం మొత్తం రూ.100 కోట్లకు పైగా ఉండనుంది. కర్నూలు జిల్లాలో 23,000కు పైగా రైతులకు రూ.76 కోట్లు, కడప జిల్లాలో 6,000కు పైగా రైతులకు రూ.28 కోట్లు ఇలా మొత్తం 30,000కు పైగా రైతులు లబ్ధి పొందనున్నారు.
ఈ మొత్తాన్ని రైతుల బ్యాంకు ఖాతాల్లో నేరుగా జమ చేయనున్నారు. ఈ పరిహారం e-క్రాప్ బుకింగ్ చేసుకున్న రైతులకు మాత్రమే వర్తిస్తుందని అధికారులు స్పష్టం చేశారు. e-క్రాప్ ద్వారా పంట వివరాలు నమోదుచేసుకున్న రైతులకు ప్రభుత్వ సహాయాలు, బీమా, పరిహారాలు సులభంగా అందుతాయి.
