సేంద్రీయ వ్యవసాయం అనేది నేలలు, పర్యావరణ వ్యవస్థలు మరియు ప్రజల ఆరోగ్యాన్ని నిలబెట్టే ఉత్పత్తి వ్యవస్థ. ఇది ప్రతికూల ప్రభావాలతో ఇన్‌పుట్‌లను ఉపయోగించడం కంటే స్థానిక పరిస్థితులకు అనుగుణంగా పర్యావరణ ప్రక్రియలు, జీవవైవిధ్యం మరియు చక్రాలపై ఆధారపడుతుంది. అయితే ప్రదీప్ కుమార్ ద్వివేది యూపీలోని అలహాబాద్‌కు చెందిన వ్యక్తి. 45 ఏళ్ల వయసున్న ఆయన ఆర్గానిక్ ఫార్మింగ్‌నే తన వృత్తిగా ఎంచుకున్నారు. ఫుడ్ సైన్స్‌లో బీటెక్, కెమికల్ ఇంజినీరింగ్‌లో ఎంటెక్ పూర్తి చేశారు. దాదాపు 26 ఏళ్ల పాటు వివిధ కంపెనీల్లో పనిచేశారు. ప్రొడక్ట్ ఇంజినీరింగ్, ఆర్అండ్‌డీ, ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్, క్వాలిటీ అనాలసిస్, క్వాలిటీ కంట్రోల్ వంటి విభాగాల్లో విధులు నిర్వర్తించారు.
ఎఫ్‌ఎంసీజీ, ఫుడ్, ఫార్మా, కెమికల్స్, హెర్బల్ రంగాలకు చెందిన కంపెనీల్లో అనుభవం సంపాదించారు. అనేక ఇన్నోవేటివ్ ప్రాజెక్టుల్లో భాగమయ్యారు. కార్పొరేట్ రంగంలో సుదీర్ఘకాలం పనిచేసిన ప్రదీప్‌కు ఒకానొక సందర్భంలో తన ఫ్యూచర్‌పై డౌట్ వచ్చింది. దీంతో ఎంత కాలం ఇలా పనిచేస్తామనే సందిగ్ధంలో పడిపోయారు. తర్వాత రిస్క్ తీసుకొని 2010లో ఉద్యోగం వదిలేశారు. ఆర్గానిక్ ఫార్మింగ్‌పై దృష్టి సారించారు. ఫతేహ్‌పూర్ జిల్లాలో 300 ఎకరాల్లో కాంట్రాక్ట్ ఫార్మింగ్ ప్రారంభించారు. ఒకసారి ప్రదీప్ పెరూ దేశం వెళ్లారు. అక్కడ క్వినోవా సాగు గురించి తెలుసుకున్నారు. భారత్‌కు తిరిగొచ్చి ఒక నలుగురు రైతులతో కలిసి క్వినోవా సాగును ప్రారంభించారు.
అది ఎంత లాభదాయకమో రైతులకు రుచి చూపించారు. ముందు రైతులను ఒప్పించేందుకు చాలా శ్రమించాడు. కొనుగోలుదారులను గుర్తించడంలోనూ ఇబ్బందులు తప్పలేదు. క్రమంగా ఒక్కో సవాలును అధిగమించారు. ప్రస్తుతం ఆరు రాష్ట్రాల్లో 40,000 మంది రైతులతో కలిసి పనిచేస్తున్నారు. సబ్జా, అవిసె గింజలతో పాటు క్వినోవా, ముల్లంగి, మునగ వంటి పంటలకు ఆయన ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. సాగును బిజినెస్‌గా మార్చిన ప్రదీప్.. వినూత్న పద్ధతులకు శ్రీకారం చుట్టారు. రైతులకు ఆయనే విత్తనాలు అందజేస్తారు. టెక్నాలజీ సపోర్ట్, కోత తర్వాత ప్రాసెసింగ్ పరంగా సహాయం చేస్తారు. స్వయంగా పంటను కొని విక్రయిస్తారు.
దీనికోసం ప్రదీప్ ప్రత్యేకంగా ఆర్‌అండ్‌డీ విభాగాన్ని కూడా నెలకొల్పారు. వీరు పంటకు అధిక విలువను సమకూర్చేందుకు కావాల్సిన అంశాలపై పనిచేస్తారు. షుగర్ కేన్ పౌడర్‌ను తయారు చేశారు. దీనితో ఎప్పుడంటే అప్పుడు చెరకు రసాన్ని తయారు చేసుకోవచ్చు. రూ.5 లక్షల పెట్టుబడితో ప్రారంభమైన ఆయన బిజినెస్ ఇప్పుడు ఏటా రూ.48 కోట్ల వార్షిక టర్నోవర్‌కు చేరుకుంది. నోయిడాలో క్వినోవా మిల్క్ ప్లాంట్‌ను స్థాపించారు. ప్రదీప్ దాదాపు 155 ఇంటర్నేషనల్ రీసెర్చ్ పేపర్లను పబ్లిష్ చేశారు. ‘క్వినోవాతో భారత్‌లో ఆహార భద్రత’ అనే పుస్తకాన్ని రాశారు. ఒకేసారి వివిధ రకాల పంటలు సాగు చేయాలని రైతులకు ప్రదీప్ సూచిస్తున్నారు. ఎక్కువ డిమాండ్ ఉండే మునగ, క్వినోవా పంటలను పండించాలని చెబుతున్నారు.