విలాసవంతమైన జీవితం గడిపి పేదరికంతో పోరాడిన వారెందరో. ఇక సినిమాల్లో అవకాశాలు రాక కూలీ పనులు చేసుకుంటున్న వారు కూడా మీడియాలో కనిపిస్తూనే ఉన్నారు. తాజాగా తొలి సినిమాతోనే హిట్ కొట్టి 3 ఏళ్లలో ఏకంగా 13 సినిమాలు చేసిన హీరో ఇప్పుడు అడ్రస్ లేకుండా పోయాడు. అయితే ఒకప్పుడు టాలీవుడ్ క్రేజీ హీరో. విజయవాడలో పుట్టి పెరిగాడు. అక్కడే చదువుకున్నాడు. గుంటూరు ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాడు.
ఆపై సినిమాల మక్కువతో హైదరాబాద్ కు వచ్చేశాడు. అవకాశాల కోసం కాళ్లరిగేలా తిరిగాడు. అదే సమయంలో అప్పుడప్పుడే ఇండస్ట్రీలో నిలదొక్కుకుంటోన్న ఒక డైరెక్టర్ తో సినిమాకు కమిట్ అయ్యాడు. చిన్న సినిమానే అయినా మొదటి మూవీతోనే మంచి హిట్ కొట్టాడు. హీరోగా యూత్ లో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత కూడా చాలా సినిమాల్లోనూ నటించాడు. కేవలం హీరోగానే కాకుండా సహాయక నటుడిగానూ మెప్పించాడు. కట్ చేస్తే..

ఉన్నట్లుండి సినిమా ఇండస్ట్రీ నుంచి అదృశ్యమయ్యాడు. 2016లో ఓ సినిమాలో నటించిన అతను గత తొమ్మిదేళ్లుగా సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నాడు. ప్రస్తుతం తన సొంతూరు విజయవాడలో వ్యవసాయ సంబంధిత మెషీన్స్ తయారుచేసే ఓ కంపెనీని నడపుతున్నాడు. శ్రీ అలియాస్ మంగం శ్రీనివాస్. ఈ రోజుల్లో మూవీ తర్వాత రయ్ రయ్, అరవింద్ 2, తమాషా, పుస్తకంలో కొన్ని పేజీలు మిస్సింగ్, గలాటా, సాహసం చేయరా డింభకా, లవ్ సైకిల్ దాదాపు 12 సినిమాలు చేశాడు శ్రీనివాస్. కానీ ఈ సినిమాలేవీ పెద్దగా ఆడలేదు.
దీంతో క్రమంగా సినిమా అవకాశాలు తగ్గిపోయాయి. దీంతో ఇప్పుడు సొంతూరు విజయవాడలో వ్యవసాయ సంబంధిత మెషీన్స్ తయారు చేసే ఓ కంపెనీ నడుపుతున్నాడీ టాలీవుడ్ హీరో. ‘2020లో కొవిడ్ కారణంగా నాన్న చనిపోయాడు. దీంతో నేను ఈ బిజినెస్ లోకి వచ్చాను. ఇది మా ఫ్యామిలీ బిజినెస్. మా తాత నుంచి తండ్రికి, ఆయన నుంచి నాకు వచ్చింది. దీనితో పాటు హైదరాబాద్‌లో వారాహి స్టూడియోస్ అని ఓ డబ్బింగ్ స్టూడియో కూడా ఉంది.
సరైన ప్లానింగ్, గైడెన్స్ లేకపోవడం వల్లనే నేను సినిమాల్లో సక్సెస్ అవ్వలేకపోయాను.నా భార్య కూడా సినిమాల్లోకి వెళ్లమని ప్రోత్సాహిస్తుంది. కానీ నాకే సరైన అవకాశాలు రాక ఇలా ఉండిపోయాను‘ అని చెప్పుకొచ్చారు శ్రీనివాస్. ప్రస్తుతం ఈ హీరో ఫొటోలు, వీడియోలు నెట్టింట బాగా వైరలవుతున్నాయి. అప్పట్లో పోలిస్తే ఇప్పుడు అసలు గుర్తు పట్టలేనంతగా మారిపోయాడీ టాలీవుడ్ క్రేజీ హీరో.
