పిల్లల అశ్లీల వీడియోలు చూసే వారిపై సైబర్ సెక్యూరిటీ ఉక్కుపాదం మోపడంతోపాటు.. తెలంగాణ వ్యాప్తంగా 24 మందిని అరెస్ట్ చేసింది. నిందితుల్లో ఇరిగేషన్ శాఖ ఉద్యోగి ఉన్నట్లు అధికారులు తెలిపారు. అంతేకాకుండా నాలుగేళ్ల చిన్నారిని పోలీసులు కాపాడినట్లు పేర్కొన్నారు. 18 టీమ్స్‌తో సైబర్ సెక్యూరిటీ ఆపరేషన్ నిర్వహించగా.. నిందితులంతా మిడిల్ క్లాస్, వర్కింగ్ ఉద్యోగులే ఉన్నట్లు అధికారులు తెలిపారు. వీరిలో గతంలోనూ ఇదే తరహా నేరాలు చేసి పోలీసులకు చిక్కిన పాత నేరస్తులు కూడా ఉన్నారు.
గత ఏడాది గణాంకాలను పరిశీలిస్తే, పిల్లల అశ్లీల వీడియోలు షేరింగ్, వాచింగ్ ఏకంగా 90 శాతం పెరిగినట్లు అధికారులు గుర్తించారు. తెలంగాణలో ఒక్క ఏడాదిలోనే చిన్నారులతో చిత్రీకరించిన అశ్లీల వీడియోలు చూసిన నిందితుల సంఖ్య పదింతలు పెరిగింది. 2025లో పిల్లల అశ్లీల వీడియోలు చూసి షేర్ చేసిన వారిపై 875 కేసులు నమోదయ్యాయి. 2024లో 37 మంది అరెస్టయ్యారు. మరుసటి ఏడాదిలో ఏకంగా 423 మందిని అరెస్ట్ అయ్యారు. టీనేజర్లే కాదు, 20 ఏళ్లు దాటిన ప్రైవేటు ఉద్యోగులు కూడా ఈ నేరాల్లో ఈజీగా చిక్కుకుంటున్నారు.

చిన్నారులతో చిత్రీకరించిన అశ్లీల వీడియోలపై ప్రపంచవ్యాప్తంగా దీనిపై నిషేధం ఉంది. అమెరికా ఐతే పోర్న్ కంటెంట్‌కు చెక్ పెట్టడం కోసం NCMEC పేరుతో ఒక యంత్రాంగాన్నే ఏర్పాటు చేసింది. ఇండియాలోని నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరోతో ఒప్పందం చేసుకుంది. తప్పిపోయిన చిన్నారుల్ని వెతికిపట్టడమే కాదు, అటువంటి అనాథ చిన్నారులతో పోర్న్ బిజినెస్ చేసేవాళ్ల ఆట కట్టిస్తుంది NCRB. ఇందుకోసం పకడ్బందీగా ఇంటర్నేషనల్ నెట్‌వర్క్ కూడా ఏర్పాటైంది. గూగుల్, మెటా, ఇతర టెక్ కంపెనీలకూ, పోలీసులకూ మధ్య అవగాహన ఉంటుంది.
అంటే.. ఎవరైనా ఆన్‌లైన్‌లో చైల్డ్ అబ్యూస్ మెటీరియల్ సెర్చ్ చెయ్యడం, సేవ్ చెయ్యడం, స్టోర్ చెయ్యడం, డౌన్‌లోడ్ చెయ్యడం, షేర్ చెయ్యడం వంటివి చేస్తే, వెంటనే.. ఈ విషయాన్ని టెక్ కంపెనీలు గుర్తిస్తాయి. వెంటనే ఫలానా ఐపీ ఎడ్రెస్ ద్వారా ఈ విధంగా జరుగుతోంది అని ఆ ఐపీ అడ్రస్‌ను NCMECకి రిపోర్ట్ చేస్తాయి. NCMEC ఆ సమాచారాన్ని భారత పోలీసులకు (TGCSB లేదా ఇతర సైబర్ యూనిట్లకు) పంపిస్తుంది. ఐపీ అడ్రస్ ద్వారా లొకేషన్ ఎక్కడ అనేది పోలీసులకు తెలుస్తుంది.
అలాగే.. ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ సాయంతో ఏ వ్యక్తి ఇదంతా చేస్తున్నారో గుర్తిస్తారు. డౌన్‌లోడ్ చేస్తే లేదా స్టోర్ చేస్తే సులభంగా ఆధారాలు దొరుకుతాయి. TGCSBలో ప్రత్యేక చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్ (CPU) ఈ కేసులను హ్యాండిల్ చేస్తుంది. అందువల్ల ఆన్‌లైన్‌లో చైల్డ్ అబ్యూజ్ చూసేవారు ఇట్టే దొరికిపోతారు.
