ఓ యువ డాక్టర్.. తన మరణంలోను ప్రాణదాతగా నిలిచింది. శ్రీసత్యసాయి జిల్లా తలుపుల మండలం నంగివాండ్లపల్లికి చెందిన భూమికారెడ్డి హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ ఆసుపత్రిలో వైద్యురాలిగా పనిచేస్తున్నారు. ఔటర్ రింగ్ రోడ్డుపై జరిగిన కారు ప్రమాదంలో డాక్టర్ భూమిక రెడ్డి తీవ్ర గాయాల పాలయ్యారు. అయితే ఏపీలోని సత్యసాయి జిల్లా తలుపుల మండలంలోని నంగివాండ్లపల్లి గ్రామానికి చెందిన నందకుమార్ రెడ్డి, లోహితల ఏకైక కుమార్తె భూమికా రెడ్డి.
మెడిసిన్ పూర్తయ్యాక భూమిక హైదరాబాద్ లోని కామినేని ఆసుపత్రిలో హౌజ్ సర్జన్‌గా పని చేస్తున్నారు. ఆమె తన ఫ్రెండ్ యశ్వంత్‌తో కలిసి ఫిబ్రవరి 1వ తేదీన ఓ ఫంక్షన్‌కు వెళ్లి తిరిగి వస్తుండగా రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. వీరు ప్రయాణిస్తున్న కారు ఓఆర్ఆర్ మీద ప్రమాదానికి గురవడంతో డాక్టర్ యశ్వంత్ అక్కడికక్కడే మృతి చెందగా, డాక్టర్ భూమిక తీవ్రంగా గాయపడ్డారు. ఆమెనునానక్‌రాంగూడ కాంటినెంటల్ ఆస్పత్రిలో చేర్పించి మెరుగైన చికిత్స చేయించినా ప్రయోజనం లేకపోయింది.

చికిత్స పొందుతూ వారం రోజుల తరువాత భూమికకు బ్రెయిన్ డెడ్ కాగా, అంత కష్ట సమయంలోనూ ఆమె అవయవాలు దానం చేయడానికి తల్లిదండ్రులు ముందుకొచ్చారు. బ్రెయిన్ డెడ్ అయిన డాక్టర్ భూమిక నుంచి గుండె, కాలేయం, ఊపిరితిత్తులు, కిడ్నీలు, కళ్లను ఆమె తల్లిదండ్రులు దానం చేశారు. డాక్టర్‌గా ఎంతో మంది పేషెంట్ల ప్రాణాలు కాపాడిన భూమిక, తాను చనిపోయినా ఐదుగురికి ప్రాణాలు పోసి అసలైన డాక్టర్ అనిపించుకున్నారని హాస్పిటల్ సిబ్బంది అన్నారు.
డాక్టర్ భూమిక అమర్ హై అంటూ ఆసుపత్రి సిబ్బంది, కుటుంబసభ్యులు నినాదాలు చేస్తూ కన్నీళ్లు పెట్టుకున్నారు. పలు ఆస్పత్రులకు ఆమె అవయవాలను తరలించి అవసరమైన పేషెంట్లకు సకాలంలో ఆపరేషన్ చేసి అమర్చారు. అవయవ దానం చేసి మరికొందరికి ప్రాణం పోసిన భూమిక మృతదేహానికి ఆసుపత్రి సిబ్బంది ఘన నివాళులు అర్పించింది. అవయవదానంతో మరికొందరి ప్రాణాలు కాపాడే అవకాశం ఉంటుందని ప్రజలకు అవగాహన కల్పించారు.