కొన్ని బ్యాంకులు రోడ్డు ప్రమాదంలో మరణిస్తే కార్డుదారుని కుటుంబానికి రూ.4 నుంచి రూ.10 లక్షల వరకు కవరేజీ ఇస్తుండగా చాలా బ్యాంకుల్లో రూ.3 కోట్ల వరకు జీవిత బీమా అందుబాటులో ఉంది. జీవిత బీమా క్లెయిమ్‌లకు సంబంధించి అన్ని బ్యాంకులు వేర్వేరు షరతులను విధిస్తున్నాయి. కాబట్టి డెబిట్ కార్డ్ పొందేటప్పుడు మీ బ్యాంక్‌తో ఈ విషయాల వివరాలను జాగ్రత్తగా తనిఖీ చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.
అయితే డెబిట్ కార్డు బీమా కవరేజ్ మొత్తం బ్యాంక్, కార్డు రకం, ఖాతా స్వభావాన్ని బట్టి మారుతుంది. కొన్ని సాధారణ కార్డులపై రూ.50 వేల నుంచి ప్రారంభమయ్యే కవరేజ్, ప్రీమియం లేదా ప్లాటినం కార్డులపై రూ.1 కోటి వరకు కూడా ఉంటుంది. రోడ్డు, రైలు ప్రమాదాలకే కాకుండా, విమాన ప్రయాణంలో జరిగే ప్రమాదాలకు కూడా ఈ బీమా వర్తిస్తుంది. అయితే విమాన ప్రమాద కవరేజ్ కోసం టికెట్‌ను అదే డెబిట్ కార్డుతో కొనుగోలు చేయడం వంటి షరతులు ఉండొచ్చు.

డెబిట్ కార్డుపై బీమా పనిచేయాలంటే లావాదేవీ షరతు అత్యంత కీలకం. ఉదాహరణకు, కొటక్ మహీంద్రా గోల్డ్, ప్లాటినం డెబిట్ కార్డులు ఉన్నవారు గత 60 రోజుల్లో కనీసం ఆరు పాయింట్ ఆఫ్ సేల్ లేదా రూ.500 విలువైన ఈ-కామర్స్ లావాదేవీలు చేసి ఉండాలి. డీబీఎస్ బ్యాంక్ ఇన్ఫినిట్ డెబిట్ కార్డుకు గత 90 రోజుల్లో కనీసం ఒక లావాదేవీ అవసరం. హెచ్డీఎఫ్సీ బ్యాంక్‌లో గత 30 రోజుల్లో కనీసం ఒక పీఓఎస్ లేదా పేమెంట్ గేట్‌వే లావాదేవీ ఉండాలి.
ఈ నిబంధనలు బ్యాంక్‌కు బ్యాంక్‌కు భిన్నంగా ఉంటాయి. డెబిట్ కార్డు బీమా క్లెయిమ్‌కు కొన్ని కీలక డాక్యుమెంట్లు అవసరం. నామినీ వివరాలు, బీమా క్లెయిమ్ ఫారం, కార్డుదారి డెత్ సర్టిఫికేట్, పోస్టుమార్టం రిపోర్ట్, ఎఫ్ఐఆర్ లేదా పంచనామా వంటి పత్రాలు తప్పనిసరి. ప్రమాదం జరిగిన ప్రదేశం, వాహన వివరాలు, ఫోటోలు కూడా అవసరమయ్యే సందర్భాలున్నాయి. చికిత్స పొందుతూ మరణిస్తే ఆస్పత్రి అడ్మిషన్, చికిత్స పత్రాలు సమర్పించాలి.

నామినీ వివరాలు బ్యాంక్‌కు నమోదు చేయకపోతే, వారసత్వ ధ్రువీకరణ పత్రాన్ని అందించాల్సి ఉంటుంది. కొన్ని బ్యాంకులు ఈ-మెయిల్ లేదా ఆన్‌లైన్ ద్వారా కూడా డాక్యుమెంట్లు స్వీకరిస్తున్నాయి. సాధారణంగా ఘటన జరిగిన 60 రోజులలోపు క్లెయిమ్ దాఖలు చేయాల్సి ఉంటుంది.
