ప్రస్తుతం తూర్పు – మధ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా ఉండగా, నేడు అల్పపీడనంగా మారే అవకాశం ఉంది. అక్టోబరు 24వ తేదీ నాటికి తుఫాను తుఫానుగా మరింత బలపడే అవకాశం ఉంది. మరోవైపు, ఉత్తర అండమాన్ సముద్రం, దానికి ఆనుకుని తూర్పు మధ్య బంగాళాఖాతంలో సోమవారం ఉదయం అల్పపీడనం ఏర్పడిందని, ఇది పశ్చిమ వాయువ్యంగా పయనిస్తుంది. అయితే తూర్పు మధ్య బంగాళాఖాతంలో ‘దానా’ తుపాన్ కేంద్రీకృతమై ఉంది. గురువారం అనగా అక్టోబర్ 24న వాయువ్య బంగాళాఖాతంలో తీవ్రతుపానుగా రూపాంతరం చెందుతుందని వాతావరణ శాఖ తెలిపింది.
గడిచిన 6 గంటల్లో గంటకు 15 కిమీ వేగంతో కదులుతున్న తుపాన్.. గురువారం అర్ధరాత్రి నుంచి శుక్రవారం తెల్లవారుజాములోపు తీరం దాటే అవకాశం ఉందని అంచనా వేస్తోంది. పూరీ-సాగర్ ద్వీపం మధ్య భితార్కానికా, ధమ్రా(ఒడిశా) సమీపంలో తీరం దాటనున్న తుపాన్.. ప్రస్తుతానికి పారాదీప్(ఒడిశా)కి 520 కిమీ.. సాగర్ ద్వీపానికి(పశ్చిమ బెంగాల్) 600 కిమీ.. ఖేపుపరా(బంగ్లాదేశ్)కి 610 కిమీ దూరంలో కేంద్రీకృతమైంది. దీని ప్రభావంతో శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలలోని తీర ప్రాంతం వెంబడి బుధవారం మధ్యాహ్నం నుంచి గంటకు 80-100 కిమీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయంది వాతావరణ శాఖ.
అలాగే మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని చెప్పింది. అటు తుఫాన్ ప్రభావంతో గురువారం రాత్రి నుంచి 100-110 కిమీ వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశముందని పేర్కొంది. భారీ వృక్షాలు, చెట్ల దగ్గర/కింద నిల్చోవడం, కూర్చొవడం చేయవద్దు. ఎండిపోయిన చెట్లు/విరిగిన కొమ్మల కింద ఉండకండి. వేలాడుతూ, ఊగుతూ ఉండే రేకు/మెటల్(ఇనుప) షీట్లతో నిర్మించిన షెడ్లకు దూరంగా ఉండండి. పాత భవనాలు, శిధిలావస్థలో ఉన్న ఇళ్లలో ఉండకండి.
కరెంట్/టెలిఫోన్ స్థంబాలకు, లైన్లకు, హోర్డింగ్స్‌కు దూరంగా ఉండండని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్ తెలిపారు. బుధు, గురువారాల్లో సముద్రం అలజడిగా ఉంటుందని.. మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లరాదని స్పష్టం చేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. మరోవైపు తుఫాన్ తీవ్రత బట్టి శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లోని స్కూల్స్‌కి సెలవులు ఇవ్వనున్నారు అధికారులు. వాతావరణ పరిస్థితిని పర్యవేక్షిస్తూ.. జిల్లాల్లోని స్కూల్స్‌కు సెలవులు ఇవ్వడంపై ఆయా డిస్ట్రిక్ట్ కలెక్టర్లు తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.