జలుబు పైభాగంలో వైరస్ దాడి చేయడం వల్ల కలిగే జబ్బు. ఇది ప్రధానంగా ముక్కు, గొంతు, స్వరపేటికను ప్రభావితం చేస్తుంది. వైరస్ సోకిన రెండు రోజుల లోపే దీని ప్రభావం మొదలవుతుంది. అయితే దిండిగల్ జిల్లాలోని నీలకోట్టై సమీపంలోని సి. పుత్తూర్ గ్రామానికి చెందిన చిన్నపాండి.. ట్యాంకర్ లారీ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. అతని భార్య భానుప్రియ. వీరికి రెండేళ్ల క్రితం వివాహం జరిగింది. ఈ దంపతులకు ప్రణీత్ అనే ఏడాదిన్నర ఏళ్ల కుమారుడు ఉన్నాడు.
జూన్ 26న ప్రణీత్‌కు జలుబు చేయడంతో తల్లిదండ్రులు సమీపంలోని దుకాణం నుంచి జలుబు మందు కొని తీసుకొచ్చారు. అదే రోజు రాత్రి చిన్నారికి జలుబు మందు తాగించి నిద్రపుచ్చారు. అయితే తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో చిన్నారి ప్రణీత్ ఆరోగ్యం మరింత క్షీణించింది. దీనితో షాక్ అయిన తల్లిదండ్రులు, ప్రణిత్ను వెంటనే వత్తలకుండులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం దిండిగల్ ప్రభుత్వ ఆసుపత్రికి, ఆపై మధురై ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
అక్కడ చికిత్స పొందుతూ జులై 4వ తేదీన ప్రణిత్ మరణించాడు. దీంతో చిన్నపాండి, భానుప్రియ దంపతులు కన్నీరుమున్నీరుగా విలపించారు. ఈ సంఘటన ఆ ప్రాంతంలో తీవ్ర విషాదాన్ని నింపింది. ప్రణీత్ తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు నీలకోట్టై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. మెడికల్ షాపుల్లో మందులు కొని పిల్లలకు వాడొచ్చా..దిండిగల్ జిల్లాలో జలుబు మందు తాగి ఏడాదిన్నర వయసున్న చిన్నారి మరణించిన ఘటన ఇప్పుడు కొత్త అనుమానాలకు తావిస్తుంది.
మెడికల్ ప్రిస్క్రిప్షన్ లేకుండా మెడికల్ షాపుల నుంచి నేరుగా మందులు కొనుగోలు చేసి వాడొచ్చా అనే అనుమానం ప్రతి ఒక్కరికీ కలుగుతుంది. ముఖ్యంగా వైద్యుడిని సంప్రదించకుండా పిల్లలకు మందులు ఇవ్వడం అత్యంత ప్రమాదకరమనే సంకేతం ఈ సంఘటన ద్వారా అవగతమవుతుంది. డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా దుకాణం నుంచి కొనుగోలు చేసిన ఏ మందులను పిల్లలకు ఇవ్వకూడదు. చిన్న వయస్సులో, శరీర నిర్మాణం చాలా సున్నితంగా ఉంటుంది.
ఇలాంటి మందులకు రియాక్షన్ చాలా ఎక్కువగా ఉంటుంది. దానిని పసి పిల్లల శరీరాలు తట్టుకోలేవు. కొన్ని మందులను పిల్లల వయస్సు, బరువు, ఆరోగ్య స్థితికి తగిన మోతాదులో మాత్రమే ఇవ్వాలి. తప్పుడు మందులు తప్పు మోతాదులో ఇవ్వడం వల్ల ప్రాణాంతకం కావచ్చు. కాబట్టి జలుబు, జ్వరం వంటి సాధారణ అనారోగ్యాలకు కూడా పిల్లల డాక్టర్ వద్దకు తీసుకెళ్లడం మంచిది.