తుపాను ప్రభావం ఆంధ్రప్రదేశ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్, మయన్మార్ తీర ప్రాంత జిల్లాలపై ప్రభావం అధికంగా చూపే అవకాశముందంది. ఆయా ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురవచ్చునని వివరించింది. ఈ నేపథ్యంలో వాతావరణ శాఖ ముందుగానే హెచ్చరికలు జారీ చేసింది. మత్య్సకారులు వేటకు వెళ్లవద్దని హెచ్చరించింది. అయితే ఏపీలో అక్టోబర్-నవంబర్ నెలలు వచ్చాయంటే చాలు తుపాన్లు, వాయుగుండాలు దాడి చేస్తూనే ఉంటాయి. బంగాళాఖాతంలో ఎక్కువ తీర ప్రాంతం ఉండడం కారణంగా సముద్రంలో ఏర్పడిన అల్పపీడనాలు గాలి కారణంగా ఏపీలోని పలు జిల్లాలపై ప్రభావం చూపిస్తుంటాయి.
గడిచిన పదేళ్లలో దాదాపు 11 తుపానులు ఏపీపై తీవ్ర ప్రభావం చూపాయి. ఈ కాలంలో నైరుతి రుతుపవనాలు ముగిసి, ఈశాన్య రుతుపవనాలు వస్తాయి. సముద్ర ఉష్ణోగ్రతలు పెరిగినప్పుడు అల్పపీడనాలు ఏర్పడి.. క్రమంగా అవే తుపాన్లుగా మారతాయి. ప్రస్తుతం బంగాళాఖాతంలో ఉన్న ఆవర్తనం క్రమంగా బలపడి ఈరోజు ఏదో ఒక సమయానికి అల్పపీడనంగా మారే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం బంగాళాఖాతంలో అధిక ఉష్ణోగ్రతలు ఉన్నందున.. అల్పపీడనం మరింత తీవ్రమై తుపానుగా మారే అవకాశాలు ఉన్నాయని ఐఎండీ అధికారులు అంచనా వేశారు. మరోవైపు అరేబియా సముద్రంలో కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం సోమవారం నాటాకి తీవ్ర వాయుగుండంగా మారనుందని వాతావారణ శాఖ తెలిపింది.

ఈ వాయుగుండం ప్రభావం తమిళనాడుతో పాటుగా ఏపీలోని రాయలసీమ ప్రాంతాలపై అధిక ప్రభావం చూపనుంది. దీంతో వాతావరణ శాఖ తమిళనాడులోని పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేయగా.. రాయలసీమ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. దక్షిణ బంగాళాఖాతంలో ఏర్పడనున్న అల్పపీడనం సోమవారం నాటికి బలపడి కోస్తా, తమిళనాడు వైపు పయనించనుంది. దీని ప్రభావంతో 14వ తేదీ నుంచి 17వ తేదీ వరకు ఏపీలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఐఎండీ రిపోర్ట్ ఆధారంగా.. సోమవారం కృష్ణా, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య జిల్లాల్లో భారీ వర్షాలకు అవకాశం ఉంది. అల్పపీడనం ప్రభావంతో మంగళవారం ఏపీలోని బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, వైఎస్సార్, అన్నమయ్య, తిరుపతి, చిత్తూరు, శ్రీసత్యసాయి జిల్లాలకు భారీ నుంచి అతిభారీ వర్ష సూచన ఉంది.
బుధవారం రాష్ట్రంలోని బాపట్ల, ప్రకాశం, నంద్యాల, కర్నూలు, అనంతపురం, వైఎస్సార్, నెల్లూరు జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు, శ్రీసత్యసాయి, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది. గురువారం నాటికి వాయుగుండంగా మారితే విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, ప్రకాశం, కర్నూలు, నెల్లూరు, వైఎస్సార్, అనంతపురం, శ్రీసత్యసాయి, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని, గంటకు 45 నుంచి 65 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తమై అన్ని జిల్లాల కలెక్టర్స్‌కి ముందస్తు సూచనలు చేసింది. మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని హెచ్చరించింది. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వారికి ఎలాంటి ప్రమాదం రాకుండా చూసుకోవాలని సంబంధిత అధికారులకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
ఏపీకి తుపాను ముప్పు ఉండగా తెలంగాణలో మాత్రం ఇందుకు భిన్నంగా వాతావరణ పరిస్థితులు ఉన్నాయి. తెలంగాణలోని పలు జిల్లాల్లో ఎండలు మండిపోతుంటే మరి కొన్ని జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న వాతావరణ శాఖ వెల్లడించిన వివరాల మేరకు సోమవారం ఈ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఆదిలాబాద్, కొమరం భీం ఆసిఫాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి, నాగర్ కర్నూల్, వనపర్తి జిల్లాలలో అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది.