స్టాండప్ కమెడియన్‌గా తన ప్రస్థానాన్ని ప్రారంభించిన రోబో శంకర్.. టెలివిజన్ షో కలక్క పావతు యారు ద్వారా గుర్తింపు తెచ్చుకున్నారు. రోబోలా డ్యాన్స్ చేస్తూ అలరించడంతో ఆయనకు ‘రోబో శంకర్’ అనే పేరు వచ్చి వచ్చింది. అనంతరం మారి, విశ్వాసం తదితర చిత్రాల్లో తన ప్రత్యేక కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.
నేనేరా మహేష్, విశ్వాసం, మాయ, త్రిష లేదా నయనతార, సింగం 3, కోబ్రా, అభిమన్యుడు లాంటి డబ్బింగ్ చిత్రాలతో రోబో శంకర్ తెలుగు ప్రేక్షకులకు పరిచయమై తనదైన కామెడీ టైమింగ్ తో అలరించారు. రోబో శంకర్ (46) గురువారం రాత్రి కన్నుమూశారు. కొంతకాలంగా కాలేయం, కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆయనకు ఇటీవల పచ్చకామెర్లు సోకడంతో ఆరోగ్యం మరింత విషమించింది.

గురువారం ఇంట్లో స్పృహ తప్పి పడిపోవడంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అయితే, చికిత్స పొందుతూ శంకర్ ప్రాణాలు కోల్పోయారు. లివర్, కిడ్నీ ఫెయిల్యూర్ కారణంగా ఆయన ప్రాణాలను కాపాడలేకపోయామని వైద్యులు తెలిపారు. రోబో శంకర్ మృతితో కోలీవుడ్‌లో విషాదం అలుముకుంది.
రోబో శంకర్‌కు భార్య ప్రియాంక, కుమార్తె ఇంద్రజ ఉన్నారు. ప్రస్తుతం శంకర్ భౌతికకాయాన్ని అభిమానుల సందర్శనార్థం చెన్నైలోని ఆయన నివాసంలో ఉంచగా, అంత్యక్రియలు ఈ రోజు జరగనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.