స్కూల్‌లో తరగతి గదిలో పాఠాలు వింటూ ఉండగా విద్యార్థిని సృహతప్పి పడిపోవడంతో ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఆమెను పరిశోధించిన వైద్యులు ఆమె గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయిందని నిర్ధారించారు. అయితే రామచంద్రపురంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న నల్లమిల్లి సిరి చదువుపై ప్రత్యేక దృష్టి పెట్టే విద్యార్థినిగా గుర్తింపు పొందింది. పదో తరగతిలో మంచి ఫలితాలు సాధించాలనే లక్ష్యంతో నిత్యం కష్టపడేది.
తాజాగా సాధారణంగానే తరగతి గదిలో ఉపాధ్యాయుడు పాఠం బోధిస్తుండగా, సిరి శ్రద్ధగా వింటూ బెంచ్‌పై కూర్చుంది. ఈ దృశ్యాలన్నీ తరగతి గదిలోని సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. అయితే అకస్మాత్తుగా సిరి పక్కకు వాలిపోయి నేలపై పడిపోయింది. ఒక్కసారిగా ఏమైందో అర్థం కాక ఉపాధ్యాయులు, తోటి విద్యార్థులు ఆమెను లేపేందుకు ప్రయత్నించారు. ముఖంపై నీళ్లు జల్లారు, చేతులు కాళ్లు రుద్దారు. కానీ ఎంత ప్రయత్నించినా స్పృహలోకి రాలేదు. వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.
అక్కడికి చేరుకునేలోపే సిరి మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ వార్త విన్న వెంటనే ఉపాధ్యాయులు, విద్యార్థులు కన్నీళ్లలో మునిగిపోయారు. తరగతి గదిలో నవ్వుతూ చదువుకుంటున్న సిరి ఇక లేదన్న నిజం వారిని తీవ్రంగా కలచివేసింది. విషయం తెలిసిన వెంటనే ఆసుపత్రికి చేరుకున్న తల్లిదండ్రులు, ఉదయం స్కూల్‌కు వెళ్లిన తమ కుమార్తె ఇలా తిరిగిరాదని తెలిసి తట్టుకోలేకపోయారు. వారి ఆవేదన అక్కడున్న ప్రతి ఒక్కరి కళ్లను తడిపించింది. సిరి మృతికి గల కారణం ఇప్పటికీ స్పష్టంగా తెలియాల్సి ఉంది.
అకస్మాత్తుగా గుండెపోటు వచ్చి ఉండవచ్చన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఘటనపై పోలీసులు విచారణ ప్రారంభించారు. పోస్టుమార్టం అనంతరమే మరణానికి గల అసలు కారణం తేలే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఏదేమైనా, తరగతి గదిలోనే ఓ విద్యార్థిని ఇలా ప్రాణాలు కోల్పోవడం గోదావరి జిల్లాలన్నింటినీ విషాదంలో ముంచేసింది. అల్లారుముద్దుగా పెంచుకున్న కుమార్తెను కోల్పోయిన ఆ కుటుంబం వేదన మాటల్లో చెప్పలేనిది. ఈ ఘటన చదువుతున్న ప్రతి ఒక్కరి హృదయాన్ని కలచివేస్తోంది.
ఏపీలో గుండెపోటుతో పదవ తరగతి విద్యార్థిని మృతి
— Telugu Scribe (@TeluguScribe) December 13, 2025
క్లాస్ రూములో పాఠాలు వింటూ ఒక్కసారిగా కుప్పకూలిన విద్యార్థిని
కోనసీమ జిల్లా రామచంద్రాపురంలో క్లాస్ రూములో పాఠాలు వింటూ, ఒక్కసారిగా కుప్పకూలిపోయిన సిరి అనే విద్యార్థిని
చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతిచెందినట్లు… pic.twitter.com/dTlA15yxS8
