తాజాగా మూడో తరగతి చదువుతున్న బాలిక తరగతి గదిలోనే గుండెపోటుతో కుప్పకూలింది. ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మృతి చెందింది. కర్ణాటక, చామరాజనగర్ జిల్లా కేంద్రంలోని సెయింట్ ఫ్రాన్సిస్ పాఠశాలలో జరిగిందీ ఘటన. అయితే కర్ణాటకలో చామరాజనగరలోని సెయింట్ ఫ్రాన్సిస్ పాఠశాలలో తేజస్విని (8) మూడో తరగతి చదువుతుంది. సోమవారం ఎంతో ఉత్సాహంగా పాఠశాలకు వచ్చిన తేజస్వి స్నేహితులతో పాటు నోట్ బుక్ చేపించేందుకు టీచర్ వద్దకు వెళ్లింది.
అనంతరం టీచర్ పక్కనే ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. అప్రమత్తమైన స్కూల్ సిబ్బంది వెంటనే ఆసుపత్రికి తరలించారు. అప్పటికే చిన్నారి గుండెపోటు కారణంగా మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. జిల్లా విద్యాశాఖ అధికారి హనుమంతశెట్టి పాఠశాలకు వచ్చి ఘటనపై ఆరా తీశారు. బాలికకు ఎటువంటి ఆరోగ్య సమస్యలూ లేవని, తమ బిడ్డకు ఎందుకు గుండెపోటు వచ్చిందో తెలియట్లేదని తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు.
గత నెలలో కూడా ఉత్తరప్రదేశ్‌లోని అలీగఢ్ జిల్లాలో ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. పాఠశాలలో స్పోర్ట్స్ అడుతున్న సమయంలో 4 ఏళ్ల బాలుడు గుండెపోటుతో కుప్పకూలి మరణించాడు. స్నేహితులతో కలిసి స్కూల్ గ్రౌండ్ చుట్టూ రెండు రౌండ్లు వేసిన బాలుడు కొద్దిసేపటికే కుప్పకూలాడు. వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తీసుకెళ్లగా.. అప్పటికి బాలుడు మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. సెప్టెంబరులో ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో 9 ఏళ్ల బాలిక పాఠశాలలోనే గుండెపోటుతో మరణించింది. ప్లేగ్రౌండ్‌లో ఆడుకుంటూ కుప్పకూలి మృతి చెందింది. ఇలా వరుసగా చిన్నారులు గుండెపోటుతో మరణించడం ఆందోళన కలిగిస్తుంది.