తన అభిమానులతో పాటు సాయమంటూ తన దగ్గరికొచ్చిన వారికి ఎప్పుడూ చిరు అండగా నిలిచారు. ఇక తాజాగా సరిగమప లిటిల్ ఛాంప్స్ షో ద్వారా పరిచయమైన సింగర్ వరుణవికి చిరు తనవంతు సాయం చేశారు. అయితే కష్టాల్లో ఉన్న సినీ ప్రముఖులు, అభిమానులకు నేనున్నానంటూ అభయ హస్తం అందించారు. వారికి అవసరమైన సాయం చేశారు.
తాజాగా మరోసారి తన గొప్ప మనసును చాటుకున్నారు చిరంజీవి. సరిగమప లిటిల్ ఛాంప్స్ షో ద్వారా పరిచయమైన సింగర్ వరుణవికి తనవంతు సాయం చేశారు చిరంజీవి. ఇటీవల వరుణవిని కలిశారు మెగాస్టార్. తన ఒడిలో పాపను కూర్చోబెట్టుకొని తన మాటలు, పాడిన పాటలు విని మురిసిపోయారు. ఇదే సందర్భంగా పుట్టుకతో అంధురాలైన వరుణవికి తన వంతు సాయం చేస్తానని చిరు మాట ఇచ్చారు. ఇప్పుడు ఆ మాటను నిలెబ్టుకుంటూ తన వంతు సాయాన్ని వెంటనే పంపించారు.
సరిగమప లిటిల్ ఛాంప్స్ లేటెస్ట్ సీజన్ గ్రాండ్ ఫినాలేకు చిరంజీవి కూతురు సుస్మిత హాజరైంది. ఇదే సందర్భంగా ఆమె చేతుల మీదుగా వరుణవి ఫ్యామిలీకి రూ.5 లక్షల చెక్కును ఇప్పించారు చిరంజీవి. చిరంజీవి పంపించిన డబ్బును వరుణవి పేరు మీద ఫిక్స్‌డ్ డిపాజిట్ చేయబోతున్నట్లు సుస్మిత తెలిపారు. ఇక ఇచ్చిన మాట ప్రకారం తన కూతురు చేతుల మీదుగానే ఈ బహుమతిని చిరంజీవి పంపించారని అనిల్ రావిపూడి పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన ప్రోమో జీ తెలుగు తాజాగా రిలీజ్ చేసింది.
సరిగమప లిటిల్ ఛాంప్స్ లేటెస్ట్ సీజన్ గ్రాండ్ ఫినాలే ఈ శనివారం ప్రసారం కాబోతుంది. ఇక సినిమాల విషయానికి వస్తే.. మెగాస్టార్ చిరంజీవి నటించిన లేటెస్ట్ సినిమా మన శంకరవరప్రసాద్ గారు సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఈ యాక్షన్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ లో నయనతార హీరోయిన్ గా నటించింది. విక్టరీ వెంకటేష్ మరో కీలక పాత్రలో మెరిశారు.
