చంద్ర గ్రహణం మనదేశంతో పాటు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, అమెరికా, ఫిజి, అంటార్కిటికాల్లో కూడా కన్పిస్తుందని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా గ్రహణం అనగానే చాలా మంది కొన్ని జాగ్రత్తలు పాటిస్తారు. ముఖ్యంగా ఇంట్లో ప్రెగ్నెంట్ మహిళలు ఉంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకొవాలి. అయితే ఖగోళ శాస్త్రం ప్రకారం.. చంద్రగ్రహణం ఒక సాధారణ ఖగోళ ప్రక్రియ మాత్రమే. అయితే భారతీయ సంప్రదాయాలు, జ్యోతిష్యం ప్రకారం దీనికి ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. కాగా ఈ గ్రహణానికి సూతక కాలం వర్తిస్తుంది.
ఈ కాలం మధ్యాహ్నం 12:57 నిమిషాలకు ప్రారంభమై గ్రహణం ముగిసే వరకు ఉంటుంది. ఈ సమయంలో ఆలయాలు మూసివేస్తారు. గర్భిణీ స్త్రీలు, వృద్ధులు, పిల్లలు కొన్ని జాగ్రత్తలు పాటించాలని పెద్దలు సూచిస్తారు. ముఖ్యంగా చంద్ర గ్రహణం రోజున గర్భిణీ స్త్రీలు కొన్ని పనులు చేయకూడదని సాంప్రదాయ నమ్మకాలు, జ్యోతిష్య శాస్త్రం సూచిస్తాయి. ఈ సమయంలో గర్భిణీ స్త్రీలు చాలా జాగ్రత్తగా ఉండాలని పెద్దలు చెబుతుంటారు.

గ్రహణం సమయంలో వాతావరణంలో ప్రతికూల శక్తి ఎక్కువగా ఉంటుందని నమ్ముతారు. కాబట్టి, గర్భిణీ స్త్రీలు ఈ సమయంలో కొన్ని ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. గర్భిణీ స్త్రీలు గ్రహణ సమయంలో బయటకు వెళ్లడం అశుభంగా భావిస్తారు. ఆ సమయంలో బయటకు వెళ్తే చంద్రుని కాంతి గర్భిణీ స్త్రీ శరీరంపై పడుతుందని.. దానివల్ల పుట్టబోయే బిడ్డకు హాని కలుగుతుందని చాలా మంది నమ్ముతారు.
అంతేకాకుండా గ్రహణ సమయంలో గర్భిణీ స్త్రీలు కత్తెరలు, బ్లేడ్లు, కత్తులు లేదా ఏదైనా పదునైన వస్తువులను ఉపయోగించకూడదు. ఒకవేళ ఇలా చేస్తే పుట్టబోయే బిడ్డకు శారీరక లోపాలు లేదా పుట్టు మచ్చలు వస్తాయని ఒక నమ్మకం. అలాగే చంద్రగ్రహణం, దాని సూతక కాల సమయంలో ఆహారం వండటం లేదా తినడం కూడా మంచిది కాదని నమ్ముతారు. గ్రహణం ప్రతికూల శక్తి ఆహారాన్ని కలుషితం చేస్తుందని.. ఇది పుట్టబోయే బిడ్డపై చెడు ప్రభావాన్ని చూపుతుందని అంటారు.
అయితే అవసరమైతే గర్భిణీ స్త్రీలు, వృద్ధులు తేలికపాటి ఆహారాన్ని తీసుకోవచ్చు. అంతేకాకుండా గర్భిణీ స్త్రీలు చంద్రగ్రహణం సమయంలో చంద్రకాంతిని నేరుగా తాకకూడదు. దీని కోసం తలుపులు, కిటికీలను మూసి ఉంచడం మంచిదని భావిస్తారు.