కొంతకాలంగా వీరిద్దరూ సోషల్ మీడియాలో రహస్య సందేశాలను పోస్ట్ చేయడంతో విడాకుల పుకార్లు చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా కొన్ని మీడియా నివేదికలు చాహల్ – ధనశ్రీ విడాకులు ఖరారయ్యాయని పేర్కొన్నాయి. అయితే, ధనశ్రీ న్యాయవాది అలాంటి వార్తలను తోసిపుచ్చారు. అయితే భారత స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ భార్య ధనశ్రీ వర్మపై సోషల్ మీడియాలో వస్తున్న కథనాలపై ఆమె కుటుంబం స్పందించింది. చాహల్ నుంచి ధనశ్రీ రూ.60 కోట్ల భరణం డిమాండ్ చేసినట్లు వస్తున్న వార్తలపై ఆమె కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
సోషల్ మీడియాలో వస్తున్న కథనాలను ఖండిస్తూ ధనశ్రీ కుటుంబం పత్రికా ప్రకటన విడుదల చేసింది. భరణం గురించి వస్తున్న కథనాలన్నీ నిరాధారమైనవని పేర్కొంటూ, అసలు అంత మొత్తాన్ని ఎవరూ అడగలేదని, అటువైపు వారు ఇస్తామని చెప్పలేదని అన్నారు. ధ్రువీకరణ లేని సమాచారాన్ని ప్రచురించడం పూర్తిగా బాధ్యతారాహిత్యమేనని, ఇలాంటి నిర్లక్ష్యపు చర్యలు హాని కలిగిస్తాయని ఆవేదన వ్యక్తం చేశారు. నిజానిజాలను ధ్రువీకరించుకోవాలని, ప్రతి ఒక్కరి గోప్యత పట్ల గౌరవంగా వ్యవహరించాలని మీడియాకు సూచించారు.
చాహల్, ధనశ్రీ వర్మకు విడాకులు మంజూరైనట్లు పలు జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. ఈ క్రమంలో భరణంపై వార్తలు వచ్చాయి. చాహల్ – ధనశ్రీ వివాహం 2020లో జరిగింది. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఈ జంట గతంలో పెట్టిన పోస్టులు అభిమానులను గందరగోళానికి గురి చేశాయి. సోషల్ మీడియాలో వారిద్దరూ ఒకరినొకరు అన్‌ఫాలో చేసుకోవడం, ధనశ్రీ తన పేరు నుంచి చాహల్ పదాన్ని తొలగించడంతో వారి మధ్య విడాకులపై పుకార్లు వచ్చాయి. వీరి విడాకుల కేసుపై ముంబయిలోని బాంద్రా కుటుంబ న్యాయస్థానంలో గురువారం తుది విచారణ జరిగినట్లు తెలుస్తోంది.
ఈ విచారణకు ఇద్దరూ వ్యక్తిగతంగా హాజరయ్యారు. వీరిద్దరికీ కౌన్సిలింగ్ సెషన్ ఇచ్చినప్పటికీ వారు విడిపోవడానికే నిర్ణయించుకోవడంతో విడాకులు మంజూరు చేస్తూ న్యాయస్థానం తీర్పు వెలువరించినట్లు సమాచారం. ఈ క్రమంలోనే ధనశ్రీ రూ.60 కోట్లు భరణం అడిగినట్లుగా వార్తలు వచ్చాయి.