కళాశాల యాజమాన్యం భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని విద్యార్థినులు డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం పోలీసులు విద్యార్థినుల భద్రత, హాస్టల్ మేనేజ్‌మెంట్ చర్యలు, హాస్టల్ సిబ్బంది పాత్రపై దర్యాప్తు కొనసాగిస్తున్నారు. అయితే మేడ్చల్‌లోని సీఎంఆర్ ఇంజనీరింగ్ కాలేజీ గర్ల్స్ హాస్టల్‌లో జరిగిన సంఘటన ఉద్రిక్తతకు దారితీసింది. హాస్టల్ బాత్‌రూముల్లో కెమెరాలు అమర్చినట్లు గుర్తించి, రహస్యంగా వీడియోలు తీస్తున్నారంటూ విద్యార్థినిలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.
ఈ ఘటనపై హాస్టల్ సిబ్బందిపై అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో రంగంలోకి దిగిన పోలీసులు అనుమానితుల నుంచి సెల్ ఫోన్స్ స్వాధీనం చేసుకున్నారు. వీడియోలు తీసిన వారిపై కఠినంగా చర్యలు తీసుకోవాలని, గోప్యతకు భంగం కలిగించిన వారి పట్ల కఠిన శిక్షలు విధించాలంటూ విద్యార్థినులు డిమాండ్ చేశారు. సంఘటనపై కళాశాల యాజమాన్యం తక్షణమే స్పందించి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని నినాదాలు చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు కాలేజీకి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.
నిరసనలో ఉన్న విద్యార్థినులతో మాట్లాడి, ఘటనపై సమగ్ర దర్యాప్తు చేస్తామని హామీ ఇచ్చారు. విద్యార్థినుల ఆందోళనను తగ్గించేందుకు ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. ఈ కేసులో హాస్టల్ సిబ్బంది నుండి 12 ఫోన్లను స్వాధీనం చేసుకుని, ఐదుగురిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. విద్యార్థినుల ఆరోపణల ప్రకారం, నిందితులు సుమారు 300 వీడియోలు రికార్డ్ చేసినట్లు తెలుస్తోంది. ఈ వీడియోలు సోషల్ మీడియాలో లీక్ అయితే ఎమ్మెల్యే మల్లారెడ్డి బాధ్యత వహించాలని విద్యార్థినులు హెచ్చరించారు.