అందానికి తగ్గ అభినయంతో.. టీవీ స్టార్‌గా ఎదిగింది హీనా! జెట్ వేగంతో దూసుకెళ్తున్న ఆమె కెరీర్‌కు.. ‘క్యాన్సర్’ సడెన్ బ్రేకులు వేసింది. ఈ ఏడాది ప్రారంభంలోనే తాను బ్రెస్ట్ క్యాన్సర్ బారినపడ్డట్టు చెప్పి.. అభిమానులను షాక్‌కు గురిచేసింది. ఒక పక్క కీమోథెరపీ చేయించుకుంటూనే.. అడపాదడపా కెరీర్‌కు సంబంధించిన ఈవెంట్లలోనూ మెరుస్తున్నది. అయితే ప్రస్తుతం ఆమె క్యాన్సర్‌కు చికిత్స పొందుతోంది. ఈ చికిత్స సమయంలో, ఒక వ్యక్తి హీనాకు అడుగడుగునా అండగా నిలుస్తున్నాడు. ఆ వ్యక్తి మరెవరో కాదు హీనా ప్రియుడు రాకీ జైస్వాల్.
తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ భావోద్వేగ పోస్ట్ షేర్ చేశాడు రాకీ. దీంతో పాటు కొన్ని ఫోటోలు, వీడియోలు కూడా షేర్ చేశారు. ఇందులో రాకీ హీనాను ఎలా చూసుకుంటున్నాడో , ఆమెకు ఎలా సపోర్ట్ చేస్తున్నాడో అనేది స్పష్టంగా చూడొచ్చు. ఇది చూసిన హీనా ‘ ప్రతి స్త్రీ తన జీవితంలో ఇలాంటి మగవాడు తోడుగా ఉండాలి’ అని ఎమోషనలైంది. ‘ ప్రపంచంలో నాకు తెలిసిన మంచి వ్యక్తి ఇతడే! క్యాన్సర్ ట్రీట్‌మెంట్‌లో భాగంగా నేను గుండు చేయించుకున్నప్పుడూ అతడూ గుండు కొట్టించుకున్నాడు. నాకు వెంట్రుకలు పెరిగినప్పుడే తన జుట్టు పెరగనిస్తానన్నాడు.
నన్ను కంటికి రెప్పలా ఎంతో జాగ్రత్తగా చూసుకుంటున్నాడు. నన్ను వదులుకోవడానికి వంద కారణాలున్నప్పటికీ నాకు అండగా నిలుస్తున్నాడు. నిస్వార్థంగా ప్రేమిస్తున్నాడు. జీవితకాలమంత అనుభవాన్ని మేము ఇప్పటికే పోగు చేసుకున్నాం’ ‘మేం ఎన్నో కఠిన పరిస్థితులను ఎదుర్కొన్నాం. కానీ కష్ట కాలంలో ఒకరికొకరు అండగా నిలిచాం. కరోనా మహమ్మారి సమయంలో ఆరోగ్య సవాళ్లను ఎదుర్కొంటూ మేము చాలా కష్టమైన సమయాన్ని ఎదుర్కొన్నాం. మేమిద్దరం తండ్రులను కోల్పోయాం. ఆ కష్ట సమయాల్లో మేమిద్దరం ఏడ్చుకుంటూ ఓదార్చుకున్నాం. నాకు కరోనా సోకనప్పటికీ, అతను నాతో నే ఉన్నాడు. రోజంతా మూడు మాస్క్‌లు ధరించి నన్ను జాగ్రత్తగా చూసుకునేవాడు.
మరీ ముఖ్యంగా నాకు క్యాన్సర్ ఉన్నట్లు నిర్ధారణ అయిన తర్వాత, అతను నన్ను జాగ్రత్తగా చూసుకోవడానికి ప్రతిదీ వదిలివేసాడు. ఎక్కడ ట్రీట్‌మెంట్ బాగుంటుంది? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యుల్ని అడగాలి.. ఇలా అన్నీ ముందుగానే ప్లాన్ చేసుకున్నాడు. అలా అతడు సూచించిన కరెక్ట్ డైరెక్షన్‌లోనే నేను అడుగులు వేస్తున్నాను. కీమో థెరపీ ప్రారంభించినప్పటి నుంచి నా బాధ్యతను తన భుజాన వేసుకున్నాడు. నాకు డ్రెస్సింగ్ చేయడం, తినిపించడం.. ఇలా అన్నీ తనే చేస్తున్నాడు. నా చుట్టూ ఒక రక్షణ కవచాన్ని సృష్టించాడు. గడిచిన రెండు నెలలు నాకెంతో నేర్పాయి. రాకీ నాతో ఒక గైడ్‌లా ఉన్నాడు’ అని ఎమోషనలైంది హీనా.