శీతాకాలంలో బర్డ్‌ఫ్లూ వైరస్ ఉనికిలో ఉంటుంది. ఉష్ణోగ్రతలు పెరిగేకొద్దీ అంతరిస్తుంది. సహజంగా జలాశయాల వద్ద వలస పక్షులతో పాటు దేశీయ కొంగలు కూడా సంచరిస్తాయి. ఆ కొంగలు కోళ్ల ఫారాల వద్దకి రావడం వల్ల వైరస్ అంతర బదిలీ అవుతుందని పశువైద్య నిపుణులు చెబుతున్నారు. కోళ్ల పెంపకంలో బాధ్యతగా లేకపోతే.. ఈ వైరస్ వ్యాప్తి చెందుతుందని అంటున్నారు. ప్రస్తుత సీజన్‌లో సహజంగా కోళ్ల మరణాలు 3.5 శాతంగా ఉంటుంది. మరణాలు సహజమే కానీ.. కోళ్లు అత్యధికంగా మృతి చెందితే దానికి వైర్‌సలే కారణం. అయితే ఎక్కడ చూసినా గుట్టలు గుట్టలుగా కోళ్లు, తెగుళ్లు వచ్చినట్లు నోట్లో, కంట్లో నురగలు వచ్చి చనిపోతున్నాయి.
ఇక బర్డ్ ఫ్లూ తీవ్రతరమైన పరిస్థితుల్లో చికెన్ తినవచ్చా లేదా అనే అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. బర్డ్ ఫ్లూ ప్రబలుతున్న నేపథ్యంలోనే మాంసాహారం తినవచ్చా.. కోడి వేస్ట్‌ను చెరువులోని చేపలకు, రొయ్యలకు ఆహారంగా ఇస్తున్న తరుణంలో వాటి ద్వారా మానవులకు, చెరువు నిర్వాహకులకు ఎలాంటి ఇబ్బందులు వస్తాయో అని అటు రైతు, ఇటు వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు. ఈ విషయాన్ని నివృత్తి చేశారు శ్రీ వెంకటేశ్వర పశు వైద్య విశ్వవిద్యాలయం అధ్యాపకులు. ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు శ్రీ వేంకటేశ్వర పశువైద్య విశ్వవిద్యాలయం ఇంచార్జ్ రిజిస్ట్రార్ శ్రీలత.
రాష్ట్రంలోని తూర్పు, పశ్చిమ జిల్లాల్లో మాత్రమే బర్డ్ ఫ్లూ ప్రభావం ఉందని.. రాయలసీమ జిల్లాల్లో బర్డ్ ఫ్లూ ప్రభావం లేదన్నారు. వాతావరణంలో ఉష్ణోగ్రత పెరిగితే ఈ వ్యాధి లక్షణాలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉందన్నారు. ఎక్కువగా నాటు కోళ్లలో ఈ బర్డ్ ఫ్లూ వ్యాధి సోకుతుందని.. బాయిలర్ కోళ్లలో ఈ వ్యాధి లక్షణాలు తక్కువగా ఉంటుందన్నారు. బాగా ఉడకబెట్టిన చికెన్, గుడ్లు తినడం వల్ల బర్డ్ ఫ్లూ సోకే అవకాశమే లేదన్నారు. ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాల్లో ఎక్కువగా కేసులు ఎక్కువగా నమోదు అవుతున్నాయని చెప్పారు. శీతాకాలంలో తక్కువ ఉష్ణోగ్రత సమయంలో ఈ వ్యాధి సోకుతుందని తెలిపారు.
విదేశాల నుంచి వచ్చే వలస పక్షుల వల్ల ఈ వ్యాధి వస్తుందన్నారు. దీనిని H1N1 స్ట్రెయిన్ అని పిలువబడే వ్యాధి సోకుతుందని తెలియజేశారు. వాటి రెక్కలలో ఉండే వ్యర్థాలు ఊడి కింద నీళ్లలో పడి ఆ నీళ్లను కోళ్లు త్రాగటం వల్ల ఈ వ్యాధి అధికం అవుతుందని చెప్పారు. తక్కువ ఉష్ణోగ్రత నుంచి ఎక్కువ ఉష్ణోగ్రతలు పెరుగుతున్నప్పుడు కోళ్లు చనిపోతాయన్నారు. వాతావరణంలో ఉష్ణోగ్రత పెరిగితే ఈ వ్యాధి లక్షణాలు తగ్గుముఖం పడతాయని స్పష్టం చేశారు.