కోళ్లకు బర్డ్‌ఫ్లూ వచ్చిందని ప్రజలు భయపడొద్దని, సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేసి జనాన్ని భయపెట్టవద్దని తెలంగాణ పౌలీ్ట్ర ఫెడరేషన్ రాష్ట్ర కార్యదర్శి పాతూరి వెంకటరావు కోరారు. అయితే బర్డ్ ఫ్లూ కలకలం రేపుతోంది. ఇప్పటికే ప్రజలు చికెన్, కోడిగుడ్లు తినాలంటేనే జంకే పరిస్థితి వచ్చింది. పశ్చిమ గోదావరి జిల్లాలో ఏకంగా ప్రభుత్వమే చికెన్ తినకూడదని ప్లెక్సీలను ఏర్పాటు చేసింది. పశ్చిమగోదావరి జిల్లా తణుకు మండలం వేల్పూరును రెడ్ జోన్‌గా ప్రకటించారు. ఆ ప్రాంతానికి చెందిన ప్రజలు చికెన్‌ను తినకూడదని సూచించారు. ఇదిలా ఉంటే బర్డ్ ఫ్లూ వ్యాధిని నివారించేందుకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు.
గిరిజన గురుకులాల మెనూలో చికెన్ నిలిపివేతకు నిర్ణయం తీసుకుంది. తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు గురుకులాలు, EMRS స్కూళ్లకు చికెన్ నిలిపేశారు. చికెన్ స్థానంలో ఏదైనా శాకాహార కూర పండ్లు, స్వీట్లు అందించాలని సూచించారు. ఇదిలా ఉంటే ఏలూరు జిల్లా ఉంగుటూరు మండలంలో ఒక వ్యక్తి కి బర్డ్ ఫ్లూ నిర్దారణ అయ్యిందని. కోళ్లఫారం సమీపంలోని ఒక వ్యక్తికి బర్డ్ ఫ్లూ లక్షణాలు ఉండటంతో, శాంపిల్ చెక్ చేయగా పాజిటివ్‌గా తేలిందంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ సాగింది. అయితే ఈ ప్రచారంలో ఏమాత్రం నిజం లేదని అధికారులు తేల్చి చెప్పారు. ఈ విషయమై ఏలూరు జిల్లా కలెక్టర్ కె.వెట్రిసెల్వి స్పష్టతనిచ్చారు.
ఈ ప్రచారంలో ఏమాత్రం నిజం లేదని, అసలు విషయం తెలుసుకోకుండా భయబ్రంతులకు గురి చేయడం ఏంటని ఆమె మండిపడ్డారు. అధికారులను సంప్రదించకుండా అసత్య వార్తలను వైరల్ చేయకూడదని ఆమె హితవు పలికారు. బర్డ్ ఫ్లూ మనుషులకు వ్యాపిస్తుందని చెప్పడంలో నిజం ఉంది. ముఖ్యంగా కోళ్ల ఫామ్స్‌లో ఉండేవారు. బర్డ్ ఫ్లూ సోకిన కోడిని మాంసాన్ని నేరుగా తాకి.. ఆ చేతితో కళ్లు, నోటిని తుడుచుకోవడం లాంటివి చేస్తే వ్యాపించే అవకాశాలు ఉంటాయి. అయితే పక్షుల నుంచి మనుషులకు బర్డ్ ఫ్లూ సోకే అవకాశం అంత్యంత అరుదుగా ఉంటుందని అధికారులు చెబుతున్నారు. సాధారణంగా 70 డిగ్రీల వద్ద ఈ వైరస్ చనిపోతుంది.
కాబట్టి మనం చికెన్‌ను సుమారు 100 డిగ్రీల వద్ద వేడి చేస్తుంటాం. కాబట్టి ఈ వైరస్ బతికుండే అవకాశాలే ఉండదు. ఒకవేళ మనిషులకు బర్డ్‌ఫ్లూ వైరస్ సోకితే కొన్ని లక్షణాల ఆధారంగా గుర్తించవచ్చని నిపుణులు చెబుతున్నారు. విపరీతమైన జ్వరం ఉంటుంది. తీవ్రమైన గొంతు నొప్పి, పొడిదగ్గు వచ్చే అవకాశాలు ఉంటాయి. అలాగే తలనొప్పి, ఏ పని చేయకపోయినా అలసట, శరీరమంతా నొప్పులు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు, ఛాతీలో నొప్పిగా ఉండడం, మలబద్ధకం లేదా విరేచనాలు, కడుపు నొప్పి, కళ్లు ఎర్రబడడం వంటి లక్షణాలు కనిపించే అవకాశాలు ఉంటాయి.