బిగ్‌బాస్ కన్నడ సీజన్ 12 ఇటీవల అట్టహాసంగా ప్రారంభమైంది. హోస్ట్ సందీప్ కిచ్చ ఈ షోను రికార్డుస్థాయిలో నిర్వహించేందుకు సిద్దమయ్యారు. మొత్తం 17 మంది కంటెస్టెంట్లను ఇంటిలోకి పంపారు. జాలీ స్టూడియోలో అట్టహాసంగా ఏర్పాట్లు చేశారు. అయితే ప్రస్తుతం బిగ్ బాస్ కన్నడ సీజన్ 12 రన్ అవుతోంది. బెంగళూరు శివార్లలోని బిడడి హోబ్లిలోని జాలీవుడ్ స్టూడియోస్ & అడ్వెంచర్స్‌లో బిగ్‌బాస్ సెట్ ఏర్పాటుచేశారు.
మొత్తం 19 మంది బిగ్ బాస్ హౌస్‌లోకి కంటెస్టెంట్లుగా అడుగు పెట్టారు. ఇప్పటికే ఇద్దరు ఎలిమినేట్ అయ్యారు. ఈ రియాలిటీ షో కోసం వందలాది మంది టెక్నీషియన్లు తెరవెనుక పనిచేస్తున్నారు. అయితే జోలీవుడ్ స్టూడియోస్‌లో ఉత్పత్తి అయ్యే వ్యర్థాలను సరిగ్గా శుద్ధి చేయడం లేదని ఆరోపణలు ఉన్నాయి. బిగ్‌బాస్ సెట్ దగ్గరలో 250 KLD-సామర్థ్యం గల మురుగునీటి శుద్ధి కర్మాగారం ఏర్పాటు చేసినట్లు నిర్మాణ బృందం పేర్కొన్నప్పటికీ, అక్కడ సరైన అంతర్గత డ్రైనేజీ కనెక్షన్లు లేవని.. ఎస్ టీపీ యూనిట్ల నిర్మాణం సరిగా లేదని అధికారులు చెబుతున్నారు.
జోలీవుడ్ స్టూడియోలను నిర్వహించేందుకు కాలుష్య నియంత్రణ బోర్డు నుంచి సరైన అనుమతుల కూడా పొందలేదని చెబుతుతున్నారు. బిగ్ బాస్ షో జరుగుతున్న జాలీవుడ్ స్టూడియో నుంచి పెద్ద మొత్తంలో వ్యర్థాలు, మురుగునీరు విడుదలవుతున్నాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి. అలాగే చెత్త నిర్వహణ పద్ధతులు కూడా చాలా పేలవంగా ఉన్నాయని తేలింది. ప్లాస్టిక్ కప్పులు, పేపర్ ప్లేట్లు, ఇతర డిస్పోజబుల్స్ వంటి వ్యర్థాలు అన్నీ బహిరంగంగానే పారవేస్తున్నారని అధికారులు చెబుతున్నారు.
దీనికి తోడు 625 kVA, 500 kVA సామర్థ్యం గల రెండు డీజిల్ జనరేటర్ సెట్‌లు అక్కడ ఏర్పాటు చేశారని తేలింది. ఇవి పర్యావరణానికి మరింత ముప్పును కలిగిస్తాయని ఆందోళన చెందుతన్నారు. దీంతో వెంటనే బిగ్‌బాస్ షోను ఆపేయాలని కర్ణాటక కాలుష్య బోర్డు ఆదేశించింది. విద్యుత్ సరఫరా కూడా నిలిపేయాలని సంబంధిత శాఖను సూచించింది. నోటీసులతో బిగ్ బాస్ షూటింగ్ నిలిచిపోయింది. తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే షో కూడా ఆగిపోయే అవకాశం ఉంది. మరి కాలుష్య నియంత్రణ బోర్డు నోటీసులకు బిగ్ బాస్ నిర్వాహకులు ఎలాంటి సమాధానం ఇస్తారో చూడాలి.