బోనీ కపూర్ శ్రీదేవిని పెళ్లి చేసుకోవడానికి ముందు మోనా కపూర్‌ను పెళ్లి చేసుకున్నాడు. వీరిద్దరికీ అర్జున్ కపూర్, అన్షులా కపూర్ అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే వివిధ కారణాలతో 1996లో బోనీ కపూర్, మోనాకు విడాకులు ఇచ్చాడు. ఆ తర్వాత అతిలోక సుందరి శ్రీదేవిని పెళ్లి చేసుకున్నాడు. చిన్న వయసులోనే పేరెంట్స్ విడిపోవడంతో అర్జున్, అన్షులా ఇబ్బంది పడ్డారు.
అయితే టాలీవుడ్ నుంచి హిందీ సినిమాకి మకాం మార్చిన తర్వాత బాలీవుడ్లో వరుస సినిమాలు చేస్తూ బిజీ స్టార్‌గా, టాప్ హీరోయిన్గా మారింది శ్రీదేవి. ఈ సమయంలో మిథున్ చక్రవర్తి, శ్రీదేవి మధ్య బంధం చాలా దూరం వెళ్లింది. మిథున్, శ్రీదేవి త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నట్టుగా వార్తలు వచ్చాయి.. అయితే ఇదే సమయంలో నిర్మాత బోనీ కపూర్‌తో శ్రీదేవికి పరిచయం ఏర్పడింది..

‘మిస్టర్ ఇండియా’, ‘రూప్ కి రాణి చోరన్ కా రాజా’, ‘జుడాయి’ వంటి శ్రీదేవి నటించిన సినిమాలకు నిర్మాతగా వ్యవహరించిన బోనీ కపూర్‌తో శ్రీదేవి సన్నిహితంగా మెలగడం వల్ల మిథున్ చక్రవర్తికి అనుమానాలు వచ్చాయట. ఇదే విషయమై శ్రీదేవిని నిలదీశాడట. దీంతో ప్రియుడి అనుమానాన్ని తొలగించడానికి శ్రీదేవి, బోనీ కపూర్‌కి అందరి ముందు రాఖీ కట్టింది. అన్నయ్య అంటూ పిలిచింది. అప్పటికే బోనీ కపూర్‌కి మోనీ శౌరీ కపూర్‌తో పెళ్లి అయ్యింది.
ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు.. మిథున్ చక్రవర్తికి అప్పటికే రెండు పెళ్లిళ్లు కావడం మరో విశేషం. అయితే అన్నయ్య అని పిలిచిన శ్రీదేవితో బోనీ కపూర్ రిలేషన్ చాలా దూరం వెళ్లింది. దీంతో శ్రీదేవి పెళ్లికి ముందే గర్భం దాల్చిందని అంటారు. పరిస్థితి చేయి దాటడంతో మొదటి భార్య మోనాకి విడాకులు ఇచ్చిన బోనీ కపూర్, 1996లో శ్రీదేవిని పెళ్లి చేసుకున్నాడు.
అయితే శ్రీదేవి పెళ్లికి ముందే గర్భవతి అనే వార్తల్లో నిజం లేదని, అది కేవలం పుకారు మాత్రమేనని వ్యాఖ్యానించాడు బోనీ కపూర్. తాము 1996లో రహస్యంగా పెళ్లి చేసుకుని, 1997లో బయటికి చెప్పామని ప్రకటించాడు. 1997 జనవరిలో శ్రీదేవి గర్బాన్ని దాచే వీలు కాకపోవడంతో అధికారికంగా అందరి ముందు పెళ్లి చేసుకున్నామని చెప్పాడు.