రుతుపవన ద్రోణి ప్రభావంతో కోస్తా మీదుగా ఈ ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని పేర్కొంది. దీని ప్రభావంతో పలు చోట్ల భారీ వర్షాలు, కృష్ణా, గుంటూరులో ఓ మోస్తారు వర్షాలు పడతాయని వివరించింది.. ఈ రెండు జిల్లాలకు వాతావరణశాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. అయితే ఆంధ్రప్రదేశ్ లో కురుస్తున్న భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కారణంగా కుండపోత వర్షాలు కురిశాయి. భారీ వర్షాలతో వాగులు, వంకలు, నదులు పొంగిపొర్లుతున్నాయి.
కృష్ణా నది ఉగ్రరూపందాల్చడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఏపీలో భారీగా కురిసిన వర్షాలతో చెరువులు, కాలువలకు గండ్లు పడ్డాయి. ఇప్పటికే విజయవాడ నగరం వరద నీటిలో చిక్కుకుంది. వర్షాల ధాటికి జనజీవనం అస్తవ్యస్తమైంది. రవాణా వ్యవస్థ స్థంబించిపోయింది. వరదల కారణంగా ఆహారం, తాగునీటి కోసం ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇలాంటి సమయంలో మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్టుగా మరో పిడుగు లాంటి వార్తను అందించింది వాతావరణ శాఖ. ఏపీకి మరో అల్పపీడన ముప్పు పొంచి ఉన్నట్లు తెలిపింది.
వర్షాలు, వరదల నుంచి తేరుకుంటున్న ఏపీకి మరో అల్పపీడనం పొంచి ఉండడంతో ప్రజల్లో మళ్లీ కలవరం మొదలైంది. ఈ నెల 5వ తేదీన పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడే అల్పపీడనం క్రమేపీ బలపడే అవకాశం ఉందని వాతావరణశాఖ వెల్లడిస్తోంది. అల్పపీడనం బలపడటానికి అనుకూలంగా రుతుపవన ద్రోణులు మారుతున్నాయని.. దీని ప్రభావంతో వచ్చే 24 గంటల్లో కృష్ణా జిల్లా.. గుంటూరు జిల్లాలకు మరోసారి వర్షం హెచ్చరికలు జారీ చేసింది.
ఎన్టీఆర్ జిల్లాతో పాటు కృష్ణా జిల్లాలకు ఎల్లో అలర్ట్ హెచ్చరికలు జారీ చేసింది. కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి, ఏలూరు, బాపట్ల, గుంటూరు, ఎన్టీఆర్, కృష్ణా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు వాతావరణశాఖ అధికారులు.