క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహించిన ఈ మూవీలో పవర్ ఫుల్ వారియర్‌గా స్వీటీ కనిపించనున్నారు. ఈ నెల 5న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుండగా… ఇప్పటికే మూవీ టీం ప్రమోషన్స్ జోరు పెంచింది. అయితే ఘాటీ స్క్రిప్ట్ వినగానే తనకు బాగా నచ్చిందని తెలిపారు. ఇది ఆంధ్రా- ఒడిశా బార్డర్ లో చోటుచేసుకున్న ఒక కథని చెప్పారు. బాహుబలి, అరుంధతి సినిమాల వరుసలో ఘాటీ నిలుస్తుందని అనుష్క నమ్మకం వ్యక్తం చేశారు.
అలాగే డైరెక్టర్ క్రిష్ విజన్ ని కొనియాడారు. గంజాయి సాగు, అక్రమ రవాణా వల్ల ప్రభావితమైన శీలావతి (అనుష్క పాత్ర), దేశిరాజు (విక్రమ్ ప్రభు పాత్ర) జీవితాలను చూపించిన విధానం అద్భుతమని అన్నారు. క్రిష్ తనకెప్పుడూ గొప్ప పాత్రలను ఇస్తారని, ‘వేదం’ లో సరోజ కూడా ఎంతో సున్నితమైన, ప్రభావమైన పాత్ర అని తెలిపారు.
ఇప్పుడు ‘ఘాటీ’ లో శీలావతి పాత్ర కూడా అలాంటి గుర్తింపునే ఇస్తుందని చెప్పారు. అనంతరం రానా అనుష్క సినిమాల మధ్య గ్యాప్ గురించి అడగ్గా.. మంచి స్క్రిప్ట్స్ ఎంచుకుంటున్నానని, వచ్చే ఏడాది నుంచి వరుస సినిమాలతో ముందుకొస్తానని తెలిపారు. అలాగే త్వరలోనే అందరి ముందుకు కూడా వస్తానని అన్నారు. ఈ మధ్య ఇళ్లల్లో జరిగే పెళ్లిళ్లకు కూడా వెళ్లడం లేదని, అందరూ ఎప్పుడు కనిపిస్తావు అని అడుగుతున్నారని అన్నారు.
ఇదిలా ఉంటే ఘాటీ ప్రాజెక్ట్ సైన్ చేసినప్పుడే.. తాను ప్రమోషన్స్ లో భాగం కానని అనుష్క నిర్మాతలకు చెప్పినట్లు ఇటీవలే డైరెక్టర్ క్రిష్ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఏదేమైనా స్వీటీని ఎప్పుడెప్పుడు చూడాలా? అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ఫ్యాన్స్.