ప్రపంచంలో కేవలం రెండు మానసాదేవి స్వయంభూ ఆలయాలు ఉన్నాయి. అలాంటి స్వయంభు ఆలయాల్లో కాశింపేటలోని మానసాదేవి ఆలయం కూడా ఒకటి. కొన్ని సంవత్సరాల క్రితం కాశింపేట గ్రామంలో పొలిమేర దేవతలకు పూజలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తుండగా.. భూమిని తవ్వుతున్నప్పుడు మానసాదేవి అమ్మవారి విగ్రహం, శ్రీమహాలక్ష్మి అమ్మవారి విగ్రహం దర్శనమిచ్చాయట. ఈ విగ్రహాలు సుమారు 800 ఏళ్ళ నాటివిగా గుర్తించారు.
ఈ ఆలయంలో శ్రీమానస దేవి అమ్మవారు చాలా ప్రశాంతమైన రూపంలో, వెండి నాగుల కవచం కింద సేదదీరుతూ దర్శనమిస్తారు. ఈ ఆలయంలో అమ్మవారిని దర్శించుకొని, అమ్మవారికి నమస్కారాలు సమర్పించి ముడుపులు కడితే ఎలాంటి సమస్య అయినా తీరుతుందట. అలాగే మనసులో ఎలాంటి కోరిక కోరుకున్నా అది తక్షణమే నెరవేరుతుందని భక్తుల నమ్మకం. మరీ ముఖ్యంగా వివాహం కానివారు, సంతానం లేని వారు అమ్మవారిని మొక్కుకొని ముడుపులు కడితే ఆ కోరికలు నెరవేరుతాయని భక్తుల విశ్వాసం.
మనసుపెట్టి మొక్కితే గంటల్లోనే ఎలాంటి కోరిక అయినా నెరవేరుతుందని చెబుతూ ఉంటారు. ఈ మనసాదేవి అమ్మవారికి ప్రతీ మంగళవారం అభిషేకం నిర్వహిస్తారు. అలాగే అమ్మవారికి కుంకుమ పూజ, చండీహోమం కూడా చేస్తారు. ఈ కార్యక్రమాల్లో భక్తులు సామూహికంగా పాల్గొని అమ్మవారి ఆశీర్వాదం తీసుకుంటారు. అలాగే ఈ ఆలయంలోనే శ్రీ అపురూప మహాలక్ష్మి అమ్మవారి విగ్రహం కూడా ఉంటుంది. ప్రతీ శుక్రవారం మహాలక్ష్మి అమ్మవారికి కూడా పూజలు చేస్తారు.
ఈ అమ్మవారిని దర్శించుకుంటే ఆర్ధిక సమస్యలు తొలిగిపోతాయని భక్తులు చెబుతుంటారు. ఈ ఆలయంలో ముఖ్యంగా ఒక చోటు ఉంటుంది. అక్కడ 108 నాగ ప్రతిమ శివలింగాలను ప్రతిష్టించారు. కోనేరు చుట్టూ ఆ శివ లింగాల ప్రతిమలు దర్శనమిస్తాయి. ఈ శివలింగాలను ధర్మ గుండం నుంచి నీటిని తీసి అభిషేకం చేస్తే.. 108 శివలింగాలకు అభిషేకం చేసినట్లు అవుతుంది. అలాగే శివయ్య అనుగ్రహం మీపై కలుగుతుందని నమ్ముతుంటారు. దూర ప్రాంతాల నుంచి భక్తులు వచ్చే అవకాశం ఉండడంతో ఈ ఆలయంలో ప్రతీరోజు అన్నదానం చేస్తూ ఉంటారు.