సంధ్య థియేటర్ ఘటన నేపథ్యంలో ప్రొడ్యూసర్స్ రవిశంకర్, నవీన్ పిటిషన్ దాఖలు వేయడం జరిగిందట. సంధ్య థియేటర్ ఘటన పైన తమ మీద నమోదు చేసినటువంటి కేసును సైతం కొట్టివేయాలంటూ ఒక పిటిషన్ కూడా ప్రొడ్యూసర్స్ వేశారట.. ముఖ్యంగా థియేటర్ భద్రత తమ పరిధిలో కాదని పిటీషనర్ న్యాయవాదులు వివరించారు. అయితే సంధ్య ధియేటర్‌లో పుష్ప 2 సినిమా ప్రీమియర్ షోకు అల్లు అర్జున్ అక్కడకు వచ్చిన విషయం తెలిసిందే. ఇదే సమయంలో భారీగా జనం రావడం… తొక్కిసలాట జరగడంతో రేవతి అనే మహిళ మృతి చెందిన విషయం తెలిసిందే.
ఇదే ఘటనలో రేవతి కుమారుడు శ్రీతేజ కూడా తీవ్ర గాయాలపాలై.. ఆస్పత్రిలో వెంటిలేటర్ పై కొట్టుమిట్టాడుతున్నాడు. అయితే ఈ దుర్ఘటన ఇప్పుడు అల్లు అర్జున్ మెడకు చుట్టుకుంది. తొక్కిసలాటకు బన్నీయే కారణమంటూ.. పోలీసులు అతనిపై కేసులు నమోదు చేశారు. అంతేకాదు అరెస్ట్ చేసి ఓ రోజు చంచల్ గూడ జైలుకు కూడా పంపారు. ఆ తర్వాత అసలు కథ మొదలయ్యింది. జైలుకు వెళ్లొచ్చిన బన్నీని వరుసగా సినిమా స్టార్లంతా కలిసి పరామర్శించారు. టాలీవుడ్ స్టార్ హీరోల నుంచి … చిన్న హీరోల వరకు అంతా… అల్లు అర్జున్ ఇంటికి క్యూ కట్టారు. దీంతో ఈ వ్యవహారంపై సోషల్ మీడియాలో కూడా జోరుగా ట్రోలింగ్ జరిగింది.
ఈ ట్రోలింగ్… ఎంతలా జరిగిందంటే.. తెలంగాణ సీఎం వరకు వెళ్లింది. అసెంబ్లీ వేదికగా అల్లు అర్జున్ వ్యవహారాన్ని, తీరుపై స్వయంగా సీఎం విమర్శలు చేశారు. ఇక సీఎం రేవంత్ వ్యాఖ్యలపై ప్రెస్ మీట్ పెట్టి మరి… ఓవర్ యాక్షన్ చేశాడు అల్లు అర్జున్. తన తప్పు ఏం లేదని చెప్పుకొచ్చే ప్రయత్నం చేశాడు. థియేటర్లో ఉన్నప్పుడు…తనకు రేవతి మృతి చెందిన వార్త కూడా తెలియదని.. చెప్పుకొచ్చారు. అయితే బన్నీ వ్యవహారంపై అటు పోలీసులు కూడా సీరియస్‌గా తీసుకున్నారు. అల్లు అర్జున్ ఎంట్రీ నుంచి ఎగ్జిట్ వరకు సంధ్య థియేటర్లో ఏమైంది అన్న విషయానికి సంబంధించిన అప్ టు డేట్ ఇన్ఫర్మేషన్ అంతా వీడియోలు చేసి మరి… విడుదల చేశారు.
దీంతో ఈ వ్యవహారం బన్నీ చుట్టూ మరింత ఉచ్చు బిగించేలా చేసింది. ఈ వ్యవహారంతో… ఒకసారి జైలుకు వెళ్లి.. మధ్యంతర బెయిల్ పై విడుదల అయ్యాడు అల్లు అర్జున్. 14 రోజుల పాటు రిమాండ్ విధించినా కూడా.. బెయిల్ దొరకడంతో బయట పడ్డాడు. ఇప్పుడు ఇదే కేసులో అల్లు అర్జున్ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై నాంపల్లి కోర్టులో విచారణ జరిగింది. అయితే బన్నీకి బెయిల్ ఇవ్వొద్దని చిక్కడపల్లి పోలీసులు కౌంటర్ దాఖలు చేశారు. అల్లు అర్జున్ తరఫు న్యాయవాదులు బెయిల్ మంజూరు చేయాలంటూ వాదనలు వినిపించారు. ఇరుపక్షాల వాదనలను ముగించిన కోర్టు.. తీర్పును జనవరి 3కి వాయిదా వేసింది. దీంతో జనవరి 3 శుక్రవారం కోర్టు.. అల్లు అర్జున్ వ్యవహారంలో ఎలాంటి తీర్పు వెలువరిస్తుందని ఉత్కంఠ నెలకొంది.