కల్పిత కథల్ని వ్యాపింపజేయడానికి ఏఐ వాయిస్‌ను ఉపయోగించారని, ఇలాంటి అద్భుతమైన ఎడిట్ చేసిన క్లిప్ లు నన్ను కానీ, నా కెరీర్‌ను కానీ నాశనం చేయలేవని అజ్మల్ అమీర్ అన్నారు. రెండు పెద్ద పరిశ్రమల్లో నిరూపించుకుని కెరీర్ పరంగా ముందుకు సాగుతున్నానని అజ్మల్ వ్యాఖ్యానించారు. పూర్తీ వివరాలోకి వెళ్తే తెలుగుతో పాటు తమిళ్ సినిమాల్లో నటించిన ప్రముఖ నటుడు అజ్మల్ అమీర్ పై సంచలన ఆరోపణలు వచ్చాయి.
అమ్మాయిలతో అతను అసభ్యకరంగా ఛాటింగ్ చేశాడంటూ, వీడియో కాల్స్ కూడా మాట్లాడాడంటూ ఈ నటుడిపై ఆరోపణలు వస్తున్నాయి. ఈ మేరకు సోషల్ మీడియాలో ఒక వీడియో క్లిప్ నెట్టింట వైరలవుతోంది. చాలా మంది నెటిజన్లు ఈ వీడియోను చూసి నిజమనుకుంటున్నారు. దీంతో స్వయంగా అజ్మల్ రంగంలోకి దిగాడు. సోషల్ మీడియాలో వైరలవుతోన్న వీడియో క్లిప్ పై స్పందించాడు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఓ వీడియోను రిలీజ్ చేశాడు.
అవన్నీ ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్) సాయంతో క్రియేట్ చేసిన ఫేక్ వీడియో కాల్స్ అని కొట్టిపారేశాడు.’ ఈ కల్పిత కథలు, ఏఐ వాయిస్ ఇమిటేటింగ్, ఎడిటింగ్స్.. నన్ను కానీ, నా కెరీర్‌ను కానీ నాశనం చేయలేవు. ఆ భగవంతుడి దయ వల్ల రెండు పెద్ద (తెలుగు, తమిళ) సినిమా ఇండస్ట్రీలలో నేనేంటో నిరూపించుకోగలిగాను. నాకంటూ ఓ గుర్తింపు సంపాదించుకుని సినీ పరిశ్రమలో కొనసాగుతున్నాను.
ఇప్పుడు నా ఇమేజ్‌ను కాపాడేందుకు నాకెటువంటి మేనేజర్ లేడు, పీఆర్ టీమ్ అసలే లేదు’ ‘ గత రెండు రోజులుగా నా గురించి సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం జరుగుతోంది. ఇలాంటి సమయంలో నాకు అండగా నిలబడ్డ అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు తెలుపుతున్నాను. మీవల్లే నేను ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నాను. మీరే నా ధైర్యం’ అని వీడియో లో చెప్పుకొచ్చాడు.
