మనుషులకు డేంజర్ తప్పదా..? హిమాలయాల్లో 41 వేల ఏళ్ల నాటి జాంబీ వైరస్‌లు..!

divyaamedia@gmail.com
3 Min Read

మృత్యువు కౌగిలి నుంచి తప్పించుకుని.. సాధారణ జీవనంలో అడుగు పెట్టాం.. ఇక.. కరోనా ఖతం అయిపోతుందిలే..! హమ్మయ్య…! కరోనా రక్కసి కోరల నుంచి తప్పించుకున్నామని అందరూ ఆనంద పడుతున్నారు. అయితే.. ఇప్పుడు అందరూ షాక్‌ అయ్యే న్యూస్‌ తెరపైకి వచ్చింది. మళ్లీ భయాందోళనలు సృష్టించే వాస్తవం ముందుకు వచ్చింది. ఇప్పుడు కొత్తగా జాంబీ వైరస్‌ భయాందోళనలు రేపుతోంది. అయితే వాయువ్య టిబెటన్ పీఠభూమిలో ఉన్న గులియా హిమనీనదం నుంచి శాస్త్రవేత్తలు గడ్డకట్టిన మంచు (ఐస్‌ కోర్స్‌) సేకరించారు. ఈ ఐస్ శాంపిల్స్‌లో సైన్స్‌కు తెలియని 1,700 వైరల్ జీనోమ్‌లు ఉన్నాయి. సముద్ర మట్టానికి 6,000 మీటర్ల కంటే ఎక్కువ ఎత్తులో ఉన్న గులియా హిమానీనదం వివిధ కాలాల్లో ఈ వైరస్‌లను సంరక్షించింది.

నేచర్ జియోసైన్స్‌లో పబ్లిష్‌ అయిన అధ్యయనం ప్రకారం, వైరస్‌లు తొమ్మిది వేర్వేరు పురాతన యుగాలను దాటొచ్చాయి. ఈ స్టడీ చేయడానికి, శాస్త్రవేత్తలు ఒక ప్రత్యేక యంత్రాన్ని ఉపయోగించి 10 సెం.మీ వెడల్పు గల కోర్‌ను 300 మీటర్ల కంటే ఎక్కువ లోతుగా మంచులోకి రంధ్రం చేశారు. యూనివర్సిటీ ఆఫ్ ఒహియోకు చెందిన వైరాలజిస్ట్ మాథ్యూ సుల్లివన్ మాట్లాడుతూ, ‘ఐస్‌ కోర్‌ని సేకరించడం మొదటి దశ మాత్రమే. ఆధునిక వైరస్‌లు పురాతన వైరస్‌లను కలుషితం చేయకుండా చూసుకోవడం నిజమైన సవాలు. హిమనీనదం మంచు చాలా శుభ్రంగా, స్పష్టంగా ఉన్నందున ఎలాంటి సమస్య రాలేదు. ఇప్పుడు కాలుష్యాన్ని నివారించడానికి టీమ్‌ ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవలసి వచ్చింది.

హిమాలయాల్లో కరిగే నీరు స్వచ్ఛంగా కనిపించినప్పటికీ, శాంపిల్స్‌ని హ్యాండిల్‌ చేయడానికి, అనలైజ్‌ చేయడానికి చాలా శుభ్రమైన పద్ధతులను ఉపయోగించాం.’ అని పేర్కొన్నారు. స్టడీ లీడ్‌ ఆథర్‌, ఒహియో స్టేట్ యూనివర్సిటీలో పాలియోక్లిమాటాలజిస్ట్ జిపింగ్ జాంగ్ మాట్లాడుతూ, ‘ఈ కాల వ్యవధులు చల్లని, వెచ్చని వాతావరణాల మూడు ప్రధాన కాలాలను కవర్ చేస్తాయి. కాలక్రమేణా వైరల్ కమ్యూనిటీలు ఎలా మారిపోయాయో చూడటానికి మాకు ఒక ప్రత్యేకమైన అవకాశాన్ని ఇస్తాయి’ అని తెలిపారు. ఈ పురాతన వైరస్‌లను అధ్యయనం చేయడం ద్వారా, వైరస్‌లు గతంలో వాతావరణ మార్పులకు ఎలా అనుగుణంగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.

ప్రస్తుత ప్రపంచ వాతావరణ మార్పులకు అవి ఎలా స్పందించవచ్చో కూడా తెలుసుకునే అవకాశం కలుగుతుంది. మరో వైరాలజిస్ట్ ఎరిన్ హార్వే.. ప్రపంచ ఉష్ణోగ్రతలు పెరిగేకొద్దీ, ఈ పురాతన వైరస్‌లు వాటి చుట్టూ ఉన్న సూక్ష్మజీవుల వర్గాలను ప్రభావితం చేయగలవని సూచించారు. నిర్దిష్ట బ్యాక్టీరియాను చంపడానికి వైరస్ పరిణామం చెందుతుందని, వాటి సంఖ్యను తగ్గించవచ్చని లేదా అది వాటి జనాభా పెరుగుదలకు దారితీస్తుందని వివరించారు. ఈ జాంబీ వైరస్‌లు మనుషులకు సోకే అవకాశం ఉందని, బయటకు విడుదలైతే అవి వ్యాప్తి చెందుతాయని పరిశోధకులు హెచ్చరించారు.

ఈ పురాతన వైరస్‌లు సంవత్సరాలుగా వాటి పరిసరాలను ఎలా ప్రభావితం చేశాయో అర్థం చేసుకోవడానికి, భవిష్యత్తులో అవి వ్యాప్తి చెందకుండా నిరోధించడానికి మరింత పరిశోధన చేయవలసిన అవసరం ఉందని నొక్కి చెప్పారు. అయితే పురాతన వైరస్‌లు మంచితో పాటు కరిగిపోతే సమస్యలు వచ్చే అవకాశం లేదని ఎరిన్ హార్వే అభిప్రాయపడ్డారు. పాత వైరస్‌లు మళ్లీ కనిపించడం గురించి ఆందోళన చెందడం కంటే కొత్త వైరస్‌లు అభివృద్ధి చెందడం గురించి మరింత శ్రద్ధ వహించాలని ఆమె తెలిపారు.

Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *